భూమా కుటుంబం రాజకీయంగా రోజురోజుకూ దిగజారిపోతోంది. కుటుంబ పెద్దలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ లేకపోవడంతో వారసులు తప్పటడుగులు వేస్తున్నారు. గతంలో శోభా నాగిరెడ్డి బుద్ధి బలంతో, భూమా నాగిరెడ్డి భుజ బలంతో రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. వైసీపీ, టీడీపీ, ప్రజారాజ్యం ఇలా ఏ పార్టీలో ఉన్నా తమకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని ప్రత్యర్థులను చిత్తుచేసేవారు. వారిద్దరూ ఉండగా నంద్యాల, ఆళ్లగడ్డలో ప్రత్యర్థులకు చుక్కలు కనబడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
ఇందుకు ప్రధాన కారణం వారసురాలు భూమా అఖిలప్రియ తప్పు మీద తప్పు చేస్తుండటమే. ఆమె భర్త జగద్విఖ్యాతరెడ్డి రాజకీయాల్లో తలదూర్చడమే ఈ తప్పులకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అఖిలప్రియను ముందుపెట్టి రాజకీయం చేయాలని ఆమె భర్త భావించాడు. లోతుపాతులు తెలియకుండా అడ్డు అనుకున్నవారి మీద దుడుకుగా ప్రవర్తించారు. భౌతిక దాడులు, బెదిరింపులు, చివరికి కిడ్నాప్ రాజకీయాలు ఇవే పరిపాటి అయిపోయాయి. సంబంధంలేని విషయాల్లో కూడ సెటిల్మెంట్లకు దిగుతుండటం తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరికి భూమా అఖిలప్రియ అరెస్టయ్యేవరకు వెళ్ళింది సిట్యుయేషన్.
ఈ పరిణామాలతో బయటి వ్యక్తులకే కాదు సొంత పార్టీ నేతలు కూడ భూమా కుటుంబానికి దూరం జరిగారు. సొంత క్యాడర్ చెల్లాచెదురైంది. నంద్యాల, ఆళ్లగడ్డ ఎటు చూసినా నిరాధరణే కనిపిస్తోంది. కుటుంబంలో సైతం చిచ్చు పుట్టింది. అఖిలప్రియ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి కూడ అఖిలప్రియతో పొసగని పరిస్థితి. 2017 ఉపఎన్నికల్లో టీడీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి మీద గెలిచిన బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుండి ఆయన నియోజకవర్గంలో చురుగ్గా లేరు. పార్టీ పనులను కూడ పట్టించుకోవట్లేదు. ఇందుకు కారణం కూడ అఖిలప్రియ భర్తేనట.
ఆయన వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అఖిలప్రియ సైతం ఆయనకే మద్దతుగా ఉన్నారట. దీంతో బ్రహ్మానందరెడ్డి అలకబూనినట్టు చెబుతున్నారు. ఈ పరిణామంతో నంద్యాల టీడీపీ అనిశ్చితిలో కూరుకుపోయింది. దీనిని అదునుగా భావించిన శిల్పా మోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో టీడీపీ శ్రేణులకు ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో టీడీపీ క్యాడర్ శిల్పా వర్గంలో చేరిపోయారని, రానున్న రోజుల్లో నంద్యాల టీడీపీ ఖాళీ కావడం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు అఖిలప్రియ భర్తకే టికెట్ కేటాయిస్తే అనుమానం లేకుండా ఓడిపోతారని, అదే పార్టీకి చరమగీతమని చెప్పుకుంటున్నారు.