మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ తన మీద దాడి జరిపేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆళ్లగడ్డ రాజకీయాలు గతంలో భిన్నంగా ఉండేవని, కానీ ఇప్పుడు వ్యాపారంగా మార్చేశారని మాజీమంత్రి అఖిలప్రియ విమర్శించారు. ఎస్.లింగందిన్నె గ్రామానికి వెళ్తున్నానని తెలిసి.. కర్రలు, రాడ్లతో దాడి చేసేందుకు వైసీపీ నాయకులు కాపు కాశారని ఆరోపించారు. అటాక్ చేస్తారని తెలియగానే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి వారిని చెదరగొట్టారని చెప్పారు.
ఎస్.లింగందిన్నె గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారని, ప్రజలు ఇబ్బందులు పడకూడదనే గ్రామానికి వెళ్లలేదని పేర్కొన్నారు. అరాచకాలతో గెలవాలని చూస్తే కుదరదని అఖిలప్రియ హెచ్చరించారు. ఆళ్లగడ్డ మండలం లింగందిన్నెలో టీడీపీ మద్దతుదారులు నామినేషన్ వేయకూడదని వైసీపీ నాయకుల బెదిరింపులకు దిగారు. దీంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజే… బెదిరింపుల పర్వమూ మొదలైంది. సర్పంచి, వార్డు అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటున్న వారికి అధికార పార్టీ నేతలు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో జరిగినట్లే… గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బెదిరింపులకు దిగారు. చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో దీనికి సంబంధించిన ఆడియో టేపులు బయటపడ్డాయి. ఇక… బయటపడని బెదిరింపులకు లెక్కేలేదని తెలుస్తోంది.