విమానం గాల్లో ఉండగా ఓ చిన్నారికి ఊపిరి ఆగిపోతే.. ఎయిమ్స్ వైద్యులు అద్బుతం చేసి ఆ పాపను బతికించిన సంఘటన తాజాగా ఢిల్లీ విమానంలో చోటుచేసుకుంది. ఆ చిన్నారి అదృష్టం మేరకు అదే విమానంలో ఐదుగురు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు ప్రయాణిస్తుండటంతో… ఈ అద్భుతం జరిగింది!
వివరాళ్లోకి వెళ్తే… విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన యూకే-814 విమానం.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తోన్న ఓ రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారికి మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అయ్యింది.
దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ వైద్యులు చిన్నారిని పరీక్షించారు. అప్పటికే ఆ చిన్నారి పల్స్ పూర్తిగా పడిపోయి.. ఒళ్లంతా చల్లబడిపోయి ఉంది. పెదవులు, వేళ్లు నీలంగా మారిపోయాయి. పాపకు ఊపిరి కూడా ఆగిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో అందుబాటులో ఉన్న వనరులతో వైద్యులు వెంటనే చికిత్సను ప్రారంభించారు.
ఇందులో భాగంగా వైద్యులు సీపీఆర్ చేశారు. అనంతరం చిన్నారికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. అప్పటికే అరేంజ్ చేసి ఉన్న అంబులెన్స్ లో విమానాశ్రయం నుంచి నేరుగా నాగ్ పూర్ ఎయిమ్స్ కు చిన్నారిని తరలించారు. అనంతరం చిన్నారికి ఆపరేషన్ నిర్వహించారు.
ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎయిమ్స్ న్యూఢిల్లీ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. ఇందులో భాగంగా చిన్నారి, వైద్యుల ఫోటోలను షేర్ చేసింది.
డా. నవదీప్ కౌర్ (సీనియర్ అనెస్థీషియా)
డా. దమన్ దీప్ సింగ్ (కార్డియాక్ రేడియాలజీ)
డా. రిషబ్ జైన్ (రేడియాలజీ)
డా. ఓషికా (గైనజకాలజిస్ట్)
డా. అవిచల్ తక్సక్ (కార్డియాక్ రేడియాలజీ) వైద్యులు విమానంలో అద్భుతం చేశారని తెలిపింది.
https://twitter.com/aiims_newdelhi/status/1695872850911981988