మన్మధుడు సినిమా కామెడీ కాపీకొట్టిన రాధాకృష్ణ

Modi and YS Jagan

 అన్ని కష్టాలూ ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణకే వచినట్టున్నాయి. తెలుగుదేశం ఓటమికి చంద్రబాబు నాయుడు, వారసుడైన లోకేష్ కంటే రాధాకృష్ణే ఎక్కువ కుమిలి పోతున్నాడు. ఆంధ్ర జ్యోతి పత్రికలో రాసే ప్రతి అక్షరం, ఏబీఎన్ ఛానల్లో చూపించే ప్రతి చిత్రం రాధాకృష్ణ బాధను కళ్ళకు కట్టినట్టు చెపుతున్నాయి. ఆయన బాధలో, ఆవేదనలో కొంత నిజం ఉంది. మనం కూడా అర్ధం చేసుకోవాలి. ఆయనకు మద్దతు తెలపలేక పోయినా సానుభూతి ప్రకటించవచ్చు. అందులో తప్పులేదు. తెలుగుదేశం హయాంలో 16 పేజీలతో నడిపిన ఆంధ్ర జ్యోతి పత్రికను ఇప్పుడు కేవలం 12 పేజీలకే పరిమితం చేశారు. ఆమేరకు నాలుగుపేజీల వ్యాపారప్రకటనల ఆదాయం తగ్గిపోయినట్టే. అలాగే రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికార కార్యక్రమాల ప్రసార హక్కులు పొంది కోట్లాదిరూపాయలు దండుకున్న రాధాకృష్ణ ఇప్పుడు ఆ సదుపాయం పోవడంతో గుక్కపెట్టి ఏడవాల్సిందిపోయి, విషం కక్కుతున్నాడు. ఆయన కలంలో సిరా బదులు విషపు చుక్కలు పోస్తున్నాడు. ఆ గొంతులో మహాశివుడు మింగిన విషం దాచుకొని కక్కుతున్నాడు. ఇది తెలుగు ప్రజలు అర్ధం చేసుకోగలరు.

ఒకానొక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టినా, ఛానల్ ప్రసారాలు నిలిపి, పత్రికకు ప్రకటనలు ఇవ్వకపోయినా కెసిఆర్ పై చిన్న విమర్శ చేయడానికి భయపడ్డ రాధాకృష్ణ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిపై పేజీలకు పేజీలు విషపు వార్తలు రాస్తున్నాడు. గంటలకొద్దీ టీవీలో వ్యతిరేక వార్తలు వండి వార్చుతున్నాడు. కెసిఆర్ ఆదరించకపోయినా ఆయన భయపడకపోవడానికి కారణం చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తన జేబులో ఉండడంతో రాధాకృష్ణ కెసిఆర్ నిషేధానికి భయపడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోవడంతో రాధాకృష్ణకు ఆర్ధిక భరోసా పోయింది. పత్రికలో పేజీలు తగ్గిపోయాయి. టీవీ ఛానల్లో ప్రకటనలు పడిపోయాయి. అందుకే ఏం తిన్నా వంటబట్టడం లేదు. ఏం విన్నా చెవులకు ఇంపుగా లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీతో గంటన్నర పైగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇద్దరే ఉన్నారు. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పాలి లేదా నరేంద్ర మోడీ అయినా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడలేదు. నరేంద్ర మోడీ కూడా మీడియాతో మాట్లాడలేదు. ఇద్దరిలో ఒక్కరుకూడా కనీసం ట్విట్టర్లో స్పందించలేదు. అయినా నరేంద్రమోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తలంటు పోసినట్టు రాధాకృష్ణ తన పత్రికలో తాటికాయంత అక్షరాలతో రాసేసుకున్నాడు.

తెలుగు సినిమా హీరో నాగార్జున నటించిన ఒక సినిమాలో ఇలాంటి హాస్య సన్నివేశం ఈ రోజు రాధాకృష్ణ రాసిన వార్త చూస్తే గుర్తుకు వస్తుంది. ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తితో నాగార్జున ప్రయత్నిస్తున్న సమయంలో ఒక రహస్య మైక్ గురించి నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పి అలాంటి మైక్ ఒకటి నాగార్జునకు అమ్ముతాడు. ఆ మైక్ నాగార్జున తన ఆఫీస్ లో ఒక టేబుల్ కింద రహస్యంగా అమర్చి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటాడు. సరిగ్గా ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ ఇలాంటి మైక్ ఒకటి ప్రధానమంత్రి నివాసంలో, ప్రధానమంత్రి కూర్చున్న కుర్చీకి అమర్చినట్టున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రాయగలిగాడు. సరే, రాధాకృష్ణ ఎంత రాసుకున్నా, ఏమి రాసుకున్నా నమ్మే సామాజిక వర్గం ఉండొచ్చు. మోడీ జగన్ని తిట్టాడు అంటే పండగచేసుకునే పార్టీ, కులం ఉండొచ్చు. కానీ భేటీ దాదాపు గంటా నలభయ్ నిముషాలు నడిచింది. లేదు గంటసేపే నడిసింది అనుకున్నా మోడీ చిరాగ్గా ఉంటే, మోడీ అసహనంతో ఉంటే, మోడీ ఛీ అంటుంటే భేటీ అంతసేపు ఎలా నడుస్తుంది? జగన్ పాలన నచ్చకపోతే పదినిమిషాల్లోనే సమావేశం ముగించేయవచ్చు. ఎదుటి మనిషి నచ్చనప్పుడు గంటకు పైగా ఎదురుగా కూర్చోవడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఒకవేళ మోడీనే ఎక్కువసేపు తిట్టడం కోసం అంతసేపు కూర్చున్నా కేవలం తిట్లు తినడం కోసం అంతసేపు కూర్చునే ఓపిక జగన్మోహన్ రెడ్డికి ఉందా? అలాంటి వాతావరణంలో జగన్ అంతసేపు కూర్చోగలుగుతాడా? మనకు నచ్చని వాళ్ళతో ఐదునిమిషాలు కూడా మాట్లాడలేని మనం, ఒకరికొకరు నచ్చని ఇద్దరు వ్యక్తులు ఓ గంటకు పైగా మాట్లాడుకున్నారు అంటే, అదికూడా రాధాకృష్ణ రాసుకున్నట్టు అంటే ఎవరు నమ్ముతారు? రాధాకృష్ణ సామాజిక వర్గం కూడా ఇలాంటి రాతలను నమ్మరేమో! అయినా ఎదో దింపుడుకల్లం ఆశ. అది స్పష్టంగా రాధాకృష్ణ రాతల్లో కనిపించింది. ఇలాంటి రాతలే ఇంకా కనిపిస్తాయి. మనం ముందుముందు మరిన్ని హాస్యరసభరిత వార్తలను ఆంధ్ర జ్యోతిలో చూడొచ్చు.

Aditya for TeluguRajyam.com