అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన “అమరావతి”లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ అమరావతిలోని 29 గ్రామాల్లో అమరావతి ఎక్కడుంది? ఈ 29 గ్రామాల్లో అమరలింగేశ్వరుడు ఎక్కడ? ఈ 29 గ్రామాల్లో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎక్కడుంది?

రాజధానిగా పచ్చని పంటపొలాలు వద్దని పర్యావరణ వేత్తలు చెప్పితే వాళ్ళను తప్పుపట్టారు. పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు ఈ 29 గ్రామాల్లో పర్యటించి, పంటభూముల్లో రాజధాని నిర్మాణం వల్ల వేలాదిమంది రైతుకూలీలు ఉపాధి కోల్పోతారు అంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం అన్నారు. నదీ పరివాహకప్రాంతం కావడంవల్ల పర్యావరణం దెబ్బతింటుంది అంటే “గ్రీన్ సిటీ”గా అభివృద్ధి చేస్తాం అన్నారు.

భూములు లేకుండా రైతులేం చేస్తారు అంటే రైతులు మట్టిలోనే బ్రతకాలా, ఏసీ గదుల్లో బ్రతకొద్దా అంటూ ఎదురుదాడి చేశారు. ఈ భూములు గట్టి నేలలు కావు, నిర్మాణానికి అనుకూలం కావు అంటే ఎన్ని దేశాలు నదుల వడ్డున, సముద్రాల వడ్డున లేవు? అంటూ ప్రతివాదన చేశారు. అప్పుడు చంద్రబాబు చెప్పిందే వేదం. ఆయన పార్టీనేతలు చెప్పిందే నిజం. ఆ సామాజికవర్గం చేతిలో ఉన్న మీడియా చెప్పిందే వార్త. కాదన్న వాళ్ళపై దాడిచేశారు. నోళ్ళు మూయించారు. అప్పులు చేశారు. తప్పులు చేశారు. ప్రపంచ రాజధాని అన్నారు. ప్రపంచంలోని ఐదు మహానగరాల్లో అమరావతి ఒకటి అన్నారు. కనీసం అప్రోచ్ రోడ్డు కూడా వేయలేకపోయారు.

సరే మీరు చెప్పిందే వాదం… మీరు రాసిందే వేదం… అనుకున్నా అత్యధిక ప్రజలు అది నమ్మలేదు కదా! రాష్ట్రం మొత్తంలోనే అత్యధికులు మీరు చెప్పింది నమ్మలేదు. మీ వాదన నిజమని అనుకోలేదు. రాష్ట్రం మొత్తం ఎందుకు, మీరు సృష్టించిన అమరావతిలోనే ప్రజలు మీ మాటలు, మీ వాదనలు, మీ ప్రతిసృష్టి విశ్వసించలేదు. సరే ప్రజలు నమ్మలేదు… అంగీకరించలేదు. అయితే ప్రజల తీర్పు మీరు అంగీకరించరు.

ప్రజలు గెలిపించిన ప్రభుత్వ నిర్ణయాలు మీరు అంగీకరించరు. ఓడిపోయినా రాష్ట్ర పాలన మీచేతిలోనే ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాధికారాలు మీ కనుసన్నల్లోనే ఉండాలి. మీ పార్టీ… మీ నేతలు… మీ వ్యాపారవేత్తలు… మీ పారిశ్రామికవేత్తలు… మీ మీడియా… మీరు ఏది నిర్ణయిస్తే అది జరిగిపోవాలి. లేదంటే యుద్ధం చేస్తారు. కుట్రలు చేస్తారు. దుష్ప్రచారాలు చేస్తారు… ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. అమరావతి రాజధాని అని మీరు నిర్ణయించేశారు కాబట్టి రాజధానిగా అమరావతే కొనసాగాలి… మీరు అక్కడ పెట్టుబడులు పెట్టి భూములు కొన్నారు కాబట్టి వాటికి నష్టం కలుగకూడదు. అందుకోసం అయినా అమరావతి రాజధానిగానే కొనసాగాలి.

జి ఎన్ రావు ఎవరు? బోస్టన్ గ్రూపు ఎవరు? వాళ్ళిచ్చే నివేదికలేంటి? వాళ్ళు చెప్పేదేంటి? ఆ నివేదికలు చెత్తలో వేయమన్నారు… భోగిమంటల్లో వేయమన్నారు. మీ మాట ప్రకారం… మీడియా వార్తల ప్రకారం ప్రజలు ఆ నివేదికలు భోగిమంటల్లో వేశారు. ఆ నివేదికలు వద్దు… ఆ నివేదికల ప్రకారం మూడురాజధానులు వద్దు… అమరావతే ముద్దు అంటూ “రైతులు – రైతు మహిళలు” పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వారేం చేయాలి? అధికార వికేంద్రీకరణను ప్రతిపాదించిన జి ఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటి నివేదికలు ప్రాతిపదికగా తీసుకోవాలా లేక వదిలేయాలా?

భోగిమంటల్లో కాలిపోయిన నివేదికల కాపీలు ఇప్పుడు వెలికి తీసి బూడిదలో అక్షరాలు వెతికితే ఆ బూడిదలో విశాఖకు వ్యతిరేకంగా అక్షరాలు కనిపించాయా? ఇప్పుడు విశాఖ రాజధానిగా పనికిరాదని ఆ రెండుకమిటీలు చెప్పినట్టు మీ పార్టీకి, మీ మీడియాకి కనిపిస్తే ఇప్పుడు ప్రజలేం చేయాలి? ఆ కమిటీల నివేదికలే ప్రాతిపదికగా విశాఖ వద్దు అనాలా? లేక ఆ కమిటీలెందుకు అమరావతే కొనసాగించండి అనాలా? అమరావతి కావాలన్నా… విశాఖ వద్దు అన్నా … ప్రాతిపదిక ఏంటి? భోగిమంటల్లో కాలిపోయిన నివేదికలా? అమరావతికి ఉన్న చారిత్రక నేపధ్యమా? ఇప్పటికే రాజధానిగా అమరావతి గుర్తించారు అనే వాదమా? లేక అమరావతిలో మీ పెట్టుబడులు ఉన్నయనా? వీటిలో ఈ వాదన ప్రకారం ముందుకు సాగినా అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

Written by Aditya for TeluguRajyam.com