ప్రత్యక్ష రాజకీయాల్లోకి సినీ నటుడు సుమన్.! కానీ ఎప్పుడు.?

సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడట.! ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రావడమేంటి.? చాలాకాలంగా ఆయన రాజకీయాల్లోనే వున్నాడు.. కాకపోతే, వుండీ లేనట్టుంటాడు.! గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశాడీ సినీ నటుడు.!

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్నాడు సుమన్. అయితే, ఫలానా పార్టీలో వున్నానని ఆయన ఇంతవరకూ చెప్పింది లేదు.. ఈ మధ్యకాలంలో.! రాజకీయాల గురించి మాట్లాడుతుంటాడు. అందునా, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తుంటాడు సుమన్.

అప్పుడప్పుడూ వైసీపీ సర్కారుకి కూడా మద్దతు తెలుపుతుంటాడు. తెలంగాణలోని అధికార పార్టీ (బీఆర్ఎస్‌గా మారిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి)తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి ఆయనకి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూ తాజాగా వ్యాఖ్యానించాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగొదావరి జిల్లాలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుమన్, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు రాజకీయాలకు సంబంధించి. భారత్ రాష్ట్ర సమితికే తెలంగాణలో తాను మద్దతిస్తానని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పాడుగానీ.. ఏపీ నుంచా.? తెలంగాణ నుంచా.? ఏ పార్టీ నుంచి.? అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.

తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది నెలల్లో ఎన్నికల వాతావరణం షురూ అవనుంది. ఈ నేపథ్యంలోనే సినీ గ్లామరున్నోళ్ళు, తమను తాము అమ్మేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.