జస్టిస్ ఈశ్వరయ్యపై రక్తి కట్టని నాటకం

Justice Eswaraiah

ఇది ఏబీఎన్ ఆంద్ర జ్యోతి టీవీ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్. గొప్ప ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్యకు, జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసి ఎనిమిదేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న సుంకు రామకృష్ణకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రహస్యంగా రికార్డు చేసి ఏబీఎన్ ఛానల్ ఈ పరిశోధనాత్మక కథనాన్ని టెలికాస్ట్ చేసింది. అవతలి వాయిస్ జస్టిస్ ఈశ్వరయ్యదేనని నిరూపించడానికి బెంగుళూరులోని ట్రూత్ ల్యాబ్ లో సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అది జస్టిస్ ఈశ్వరయ్య స్వరమో కాదో తేల్చవలసింది చట్టపరమైన సంస్థలే గానీ ఏబీఎన్ కాదు.

ఈ మొత్తం సంభాషణలో, ఈ రెండు గంటల టీవీ ప్రసారంలో జస్టిస్ ఈశ్వరయ్య  మాటల్లో రెండిటిని మాత్రమే ఈ ఛానల్ తప్పు బట్టింది. ఆయన కొందరు   సుప్రీం కోర్టు జడ్జీల గురించి అన్న ఒక మాట,  సీఎం జగన్ తో మాట్లాడి నీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను అన్న మరో మాటను ఆక్షేపించారు. ఒక మాజీ న్యాయమూర్తి ఇలా మాట్లాడి ఉంటే (అది అధికారికంగా నిరూపణ అయితే ) తప్పకుండా దానిని తప్పే అనాలి. న్యాయమూర్తులైనా, మాజీలైనా ఈ విధంగా రాజకీయ నాయకులలాగా మాట్లాడం న్యాయ వ్యవస్ధకు అవమానం తెచ్చే విషయం. ఇది అనైతికం.

కానీ ఏబీఎన్ చేసింది నైతికమా? ఎంతో కాలం న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తిపై స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని కనీస నిబంధనలను ఏబీఎన్ పాటించలేదు. సుంకు రామకృష్ణ అనే వ్యక్తి ఎందుకు ఈ ఆరోపణల మీద సస్పెండ్ అయ్యారు? ఆయన ఎనిమిదేళ్లు అయినా ఎందుకు నిర్దోషిగా బయటపడలేదు? ఆయన ఏబీఎన్ ఛానల్ నే ఎందుకు ఆశ్రయించారు? ఏబీఎన్ ఛానల్ తెలుగుదేశం నాయకుడైన వర్ల రామయ్యను తమ స్టోరీకి “జడ్జి”గా ఎందుకు నియమించుకుని ఆయన చేత అమూల్యమైన “తీర్పు”ను ఇప్పించింది?

ఈ స్టింగ్ ఆపరేషన్ ను నిశితంగా పరిశీలిస్తే, మాజీ జూనియర్ జడ్జి రామకృష్ణను ప్రేరేపించి జస్టిస్ ఈశ్వరయ్యకు ఫోన్ చేయించినట్టు ఆయన హావభావాలు, మాడ్యులేషన్ బట్టి స్పష్టంగా కనిపిస్తోంది. ఈశ్వరయ్య మామూలుగా మాట్లాడడం, రామకృష్ణ గట్టిగా మైక్ సెన్స్ తో మాట్లాడడం గమనించవచ్చు. ఈ ఛానల్ శ్రవణ్ కుమార్ అనే లాయర్ ను మరొక పాత్రగా ప్రవేశపెట్టింది. చివరికి తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్యను జడ్జిగా ప్రవేశపెట్టింది.

ఇంతకీ ఈ ఛానల్ యాజమాన్యం ఏమి చెప్పదలచుకుంది? న్యాయ వ్యవస్ధ భ్రష్టు పట్టిపోయినదనేగా? న్యాయమూర్తులు రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగుతున్నారనేగా? మరి మీరు ప్రేరేపించి జస్టిస్ ఈశ్వరయ్యకు ఫోన్ చేయించిన జూనియర్ జడ్జి రామకృష్ణ న్యాయ వ్యవస్ధలో భాగం కాదా? ఆయన ఫోన్ కాల్ ను మీరు రికార్డు చేస్తున్నారన్న సంగతి ఆయనకు తెలియదా? చిన్న జడ్జి అయినా పెద్ద జడ్జి అయినా అందరూ నైతిక నిబంధనలను పాటించాలి కదా? చిన్న న్యాయమూర్తికి ఈ విషయంలో  మినహాయిపు ఇవ్వాలా?

కొసమెరుపు :

ఈ ఎపిసోడ్ పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని మాజీ పోలీసు దొర, ప్రస్తుత తెలుగుదేశం ప్రముఖ నాయకుడు  వర్ల రామయ్య ఈ ఎపిసోడ్ కు అతిధిపాత్రలో వచ్చి సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. సిబిఐకి క్రెడిబిలిటీ లేదని, రాష్ట్రంలోకి సిబిఐకి  అనుమతి లేదని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన సంగతి వర్ల రామయ్యకు, వేమూరి రాధాకృష్ణకు తెలియదా? చంద్రబాబు తదనంతర పాలనలోనే  సిబిఐ ఈ రాష్ట్రంలోకి  మళ్ళీ అడుగుపెట్టింది. బాబుగారు వద్దనుకున్న సిబిఐ మీకు ముద్దుగా ఉందా?  చూద్దాం, సిబిఐ విచారణలో ఏ నిజాలు నిగ్గుదేలుతాయో.

—శాంతారామ్