పరమ పతివ్రతాశిరోమణి రాధాకృష్ణ స్వామివారి సూక్తులు వారంవారం పదికోట్లమంది తెలుగువారిని ఎలా రంజింపజేస్తున్నాయో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. “చెబితే మానం పోతుంది…చెప్పకుంటే ప్రాణం పోతుంది” అని సామెత చెప్పినట్లు ప్రతివారం ఏదో ఒక కుంటిసాకుతో జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మకపోతే తాను స్వీకరించిన ఫీజుకు ద్రోహం చేసినట్లవుతుంది. చిమ్మితే ఎవరూ నమ్మడంలేదు. దాంతో మింగలేక కక్కలేక రాధాకృష్ణగారు పడుతున్న ఆపసోపాలు చూస్తుంటే ఆయన బాధ ఈ జన్మకు తీరేది కావడమే విషాదం. కరోనాకైనా చికిత్స ఇవాళ కాకపొతే రేపైనా లభిస్తుందేమో కానీ, రాధాకృష్ణ అనుభవిస్తున్న మానసిక చిత్రహింసకు ఏ ఫార్మా కంపెనీవారు కూడా వాక్సిన్ కనిపెట్టలేరు. చదివి మనం ముసిముసిగా నవ్వుకోవడం మినహా మరో మార్గం లేదు. ఈ వారపు విషబిందువులను పరిశీలిద్దాం.
****
“ఇప్పటివరకు దాదాపు పదిమంది ప్రధానమంత్రులయ్యారు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు.. వెళ్లారు. అందరూ పేదల కోసమే బతికినట్టు చెప్పుకున్నారు. అదేంటోగానీ దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పేదరికం పెరిగింది. పేదరిక నిర్మూలన కోసం దశాబ్దాలుగా ఖర్చు చేసిన లక్షలాది కోట్లు ఏమైనట్టు?”
చాలా గొప్ప ధర్మసందేహం వచ్చింది కదా! దేశం సంగతి కాసేపు పక్కన పెడదాము. గత ముప్ఫయి ఎనిమిదేళ్లలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఒక్క సంవత్సరాలు. పేదలకోసం సంక్షేమ పధకాలు అని ఎన్టీఆర్ ప్రతిపాదించినపుడు కొందరు అధికారులు, ఆర్థికవేత్తలు వ్యతిరేకించారు. సంపదసృష్టి లేకుండా సంక్షేమ పధకాల పేరుతో ఖజానాను పంచెయ్యడం వలన రాష్ట్రం దివాళా తీస్తుందని మొత్తుకున్నా ఎన్టీఆర్ వినలేదు. ప్రజలకోసం వినియోగించని డబ్బు దేనికి అని ప్రశ్నించి కొన్ని సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ఎన్టీఆర్ కు మంచి పేరు వచ్చింది. కానీ, రాష్ట్రం దివాళా తీసింది. ఉచితాలకు జనం అలవాటు పడిపోయారు.
ఎంతలా అంటే ఏవైనా పధకాలను తొలగిస్తే దాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకించేంత! ఇక గొప్ప సంస్కరణలవాదిగా టముకు వేయించుకున్న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి అరవై వేలకోట్ల రూపాయల అప్పులు చేశారు. ఆయన ఒక్క ప్రాజెక్ట్ కట్టించింది లేదు. ఒక్క కర్మాగారాన్ని నిర్మించింది లేదు. ఇక రాష్ట్రం విడిపోయాక ఐదేళ్లు పాలించి మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఖజానాను దివాళా తీయించి కేవలం వందకోట్ల రూపాయలు మిగిల్చి ఇంటికి వెళ్లారు. ఇక ఆ లక్షల కోట్లు ఏమైనట్లు అంటూ రాధాకృష్ణ భలే విచిత్రమైన ప్రశ్న వేశారు. 1995 ప్రాంతంలో తన వార్షిక ఆదాయం ముప్ఫయి ఆరు వేలు అని చెప్పుకున్న చంద్రబాబు నేడు లక్షల కోట్ల అధిపతి అయ్యాడన్నా, 1990 ప్రాంతంలో అయిదువేల రూపాయల జీతగాడిగా ఉన్న రాధాకృష్ణ నేడు వేలకోట్ల రూపాయల సంస్థలకు అధిపతి అయ్యాడన్నా, ఎక్కడికి పోయాయని వాపోతున్న ఆ లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో అర్ధం కావడం లేదా?
****
“ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులు పంచుతున్న జగన్‌మోహన్ రెడ్డి తన పదవీ కాలం ముగిసేసరికి రాష్ట్రంలో పేదరికం ఉండదని చెప్పగలరా? లేని పక్షంలో హేతుబద్ధత లేకుండా ప్రజల సొమ్మును పప్పుబెల్లాల్లా పంచిపెట్టి ఓట్లు కొనుగోలు చేసే హక్కు ముఖ్యమంత్రులకు ఎవరిచ్చారు? “
అడవిలో అప్పుడే పుట్టిన నక్కపిల్ల చెట్లనుంచి కారుతున్న నీటిబొట్లను చూసి “నా జీవితంలో ఇంత గాలివానను చూడలేదని” కళ్ళు విశాలం చేస్తూ అన్నదట! గతంలో డబ్బులు పంచిన ముఖ్యమంత్రులు అందరూ తమ పదవీకాలం ముగిసేసరికి రాష్ట్రంలో పేదరికం ఉండదని హామీ ఇచ్చారా? మరి చంద్రబాబు నాయుడు తన అధికారాంతంలో అప్పుచేసి ప్రజలసొమ్మును పప్పుబెల్లాల్లా పంచినపుడు ఈ సందేహం కలగలేదా?
తెలంగాణాలో కేసీఆర్ కూడా అనేక సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు. ఈ ప్రశ్న కేసీఆర్ ను అడిగే దమ్ము రాధాకృష్ణకు ఉన్నదా? కేవలం సంక్షేమ పధకాలు చూసే ఓట్లు వేస్తారా? దానికి తోడు అభివృద్ధి కూడా చేసి చూపించాలి. కాబట్టే నాడు వైఎస్సార్, మొన్న కేసీఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. ప్రజాధనమంతా లూటీ చెయ్యడమే తప్ప నయాపైసా అభివృద్ధి కూడా చెయ్యకపోవడంతోనే చంద్రబాబును తరిమేశారు! రాధాకృష్ణకు తెలియని సంగతా ఇది! మన పిచ్చి కాకపొతే!!!
****
“తెల్లారిలేస్తే అప్పు చేయనిదే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్త కాదు. కాకపోతే అప్పు చేసి మరీ సంక్షేమ పథకం అంటూ ప్రజలకు డబ్బు పంచిపెట్టే కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఊపందుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో పేదల పేరిట సంక్షేమ పథకాలను విచ్చలవిడిగా అమలుచేస్తున్నారు”
పాపం..రాధాకృష్ణ! వయసుతో పాటు మతిమరపు కూడా పెరిగినట్లుంది. లేక నటిస్తున్నారో తెలియదు…చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినపుడు ప్రతిరోజూ అధికారులు అప్పుకు రిజర్వ్ బ్యాంకు కు వెళ్లి నిలుచునేవారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వస్తున్నాడు అంటేనే తన మంత్రులు, అధికారులను ఆయనకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి పంపించేవారు చంద్రబాబు. ఆ అధికారి ముందు చంద్రబాబు కూడా చేతులు కట్టుకుని నిలబడేవాడు. అప్పులు ఇవ్వమని అతగాడిని బతిమాలుకొని, వారు ఎంత వడ్డీ అంటే అంత వడ్డీకి అప్పులు తీసుకునేవారు. ఆ లక్షల కోట్ల రూపాయలు నిజంగా పేదలకు చేరితే రాష్ట్రంలో పేదరికం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కూడా అప్పులు చేస్తున్నారు. కానీ, ఆ అప్పులను తాను మింగడంలేదు. పేదప్రజలకు పంచుతున్నారు. ఆ డబ్బులన్నీ పేదప్రజానీకానికి నిజంగా అందుతుండటంతో వారంతా జగన్ కు ఎక్కడ ఓటు బ్యాంకు గా మారుతారో అనేది రాధాకృష్ణ గారి ఆవేదన! కరోనా పేరు చెప్పి తన సంస్థలో పనిచేస్తున్న వందలమంది ఉద్యోగులను వీధిపాలు చేసిన రాధాకృష్ణకు పేదలంటే ఎంత ప్రేమో కదా!
****
“విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి రెవెన్యూ లోటు ఎదుర్కొంటోంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎన్నికలకు ముందు పది వేల కోట్ల రూపాయల వరకూ అప్పు చేసి మరీ పసుపు–కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు పది వేల రూపాయలు వంతున పంచిపెట్టారు. “
అరెరెరెరె…ఇప్పుడే కాదయ్యా అప్పులు చేసి ప్రజలకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారని నక్క ఏడుపులు ఏడ్చావు! అంతలోనే నాలుక మడతేసి సంక్షేమ పధకాల విషయంలో చంద్రబాబు వెనక్కు తగ్గలేదని ప్రశంసిస్తావేమి? ఎన్నికలకు ముందు పదివేల కోట్ల రూపాయలు అప్పుచేసి అంటున్నావు…ఆనాడు అది ముప్ఫయివేలకోట్ల రూపాయలు అని నీ పత్రికలో రాసినట్లు గుర్తు. అలాగే చంద్రబాబు కూడా ముప్ఫయి వేలకోట్ల రూపాయలు పంచామని చెప్పిన జ్ఞాపకం.
ఇంతకూ పంచింది పదివేల కోట్లా లేక ముప్ఫయివేల కోట్లా? అంటే…దీనిలో కూడా ఇరవైవేలకోట్లు నొక్కేశారా ఏమిటి? ఎన్నికలకు ముందు పంచారని చెప్పి భలే దొరికిపోయాడు రాధాకృష్ణ. అంటే ఎన్నికలు వచ్చేదాకా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదనే కదా అర్ధం! ఇంతకూ చంద్రబాబు చేసింది తప్పా ఒప్పా? ఇప్పుడు మాకు బాగా క్లారిటీ వచ్చింది. చంద్రబాబు అప్పులు చేసి పేదలకు పావలా పంచి ముప్పావలా తాను మింగేస్తే అది ఒప్పు. జగన్‌మోహన్ రెడ్డి వందరూపాయలు అప్పుచేసి వందరూపాయలూ పేదలకు పంచితే అది తప్పు! మర్యాదరామన్న పోస్టుకు సరిపోయేవాడివి నువ్వేనయ్యా!
*****
“జగన్‌తో పోలిస్తే చంద్రబాబు నాయుడు కొంత సులువుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ కారణంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1995లో చంద్రబాబు చేతికి వచ్చింది. ఈ కారణంగా రాజకీయంగా నిలదొక్కుకోవడానికై ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శ్రమించారు.”
ఆహా! ఎంత సులువుగా తేల్చేశారు రాధాకృష్ణ గారూ! పాపం ఎన్టీఆర్ అమాయకుడు కావడంతో అల్లుడిని నమ్మేశారు. ఆ దశమగ్రహమే తన వెన్నులో బాకు దించుతుందని, తనను చంపేస్తుందని ఏమాత్రం ఊహించని నిష్కపటి! అందుకే చంద్రబాబు సులభంగా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇక ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి ముక్కలు చేశాడు. వారిలో వారికి తగాదాలు పెట్టాడు. అవసరానికి వాడుకుని ఆ తరువాత కరివేపాకుల్లా విసిరి అవతల పారేశాడు. ఇదేగా చంద్రబాబు పడిన శ్రమ!
*****
“తండ్రీకొడుకుల చేతిలో ఓడిపోయిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరేమో! తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని మించి ఓట్లూ సీట్లూ సాధించి జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావాలన్నది ఆయనలో ఎప్పటి నుంచో ఉన్న కాంక్ష. అయితే ఆ పదవిని అందుకోవడానికి ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు”
“తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాడన్నా” అని ఏదో ఒక పాత సినిమాలో జాలాది ఒక పాట రాసినట్లు గుర్తు. ఎంత అబద్ధాలు రాద్దామన్నా, ఎంత దుష్ప్రచారం చేద్దామన్నా, ఒక్కోసారి నిజం రాయక తప్పని పరిస్థితి! ఇంకా చెప్పాలంటే రాయడానికి అబద్ధాలే దొరకని పరిస్థితి! చంద్రబాబు తండ్రీకొడుకుల చేతిలో ఓడిపోయిన ముఖ్యమంత్రి మాత్రమే కాదు…”కొడుకు చేతిలో ఓడిపోయిన తండ్రీకొడుకులు” అనే ఖ్యాతి కూడా చంద్రబాబుకే దక్కుతుంది! రాధాకృష్ణ మరొక సత్యాన్ని కూడా అనుకోకుండా కక్కేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబులా వెన్నుపోట్లను ఆశ్రయించలేదు జగన్‌మోహన్ రెడ్డి. అందుకోసం అలుపెరుగని ప్రజాపోరాటం చేశారు. నమ్మి ఎమ్మెల్యేను, మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి చంద్రబాబు మామగారి పాదాల చెంత చేరి, ఆయన పార్టీనే దురాక్రమించగా….. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులను తృణప్రాయంగా త్యజించి సొంత పార్టీ పెట్టుకుని అలుపెరుగని పోరాటం గావించి తన లక్ష్యాన్ని సాధించుకున్న వీరాగ్రేసరుడు జగన్‌మోహన్ రెడ్డి! నిజాన్ని అంగీకరించినందుకు రాధాకృష్ణను అభినందిద్దాం…
*****
“బెంగళూరు, హైదరాబాద్‌లో రాజసౌధాలను తలపించే లంకంత ఇళ్లు కట్టుకున్నప్పటికీ జగన్‌మోహన్ రెడ్డి వాటిలో పట్టుమని పది రోజులు కూడా ప్రశాంతంగా కంటినిండా నిద్రపోలేదు. సంవత్సరాల తరబడి జనంతో మమేకమై తిరిగారు. 2014లో ఓటమి ఎదురైనప్పటికీ కుంగిపోకుండా పాదయాత్ర పేరిట మళ్లీ జనంలో పడ్డారు. ఊహకు కూడా తట్టని వ్యూహాలతో చంద్రబాబును ఊహించని విధంగా దెబ్బకొట్టారు.”
అధికారంలోకి రాగానే, నదీతీరంలో ఒక విశాలమైన అక్రమకట్టడాన్ని కబ్జాచేసి సౌదీ యువరాజులా మందీమార్బలంతో విలాసవంతంగా ఐదేళ్లు గడిపిన చంద్రబాబు…ప్రజలు అధికారం నుంచి తరిమికొట్టగానే ఆరు నెలల పాటు ప్రజలకు ముఖం చాటేసి, ఆ తరువాత కరోనా భయంతో తెలంగాణలోని మూడువందల కోట్ల రూపాయల తన రాజభవనంలో దాక్కున్న చంద్రబాబును చూసినపుడు లంకంత కొంపలు ఉన్నప్పటికీ, వాటిలో దర్జాగా జీవించకుండా, నిరంతరం ప్రజల మధ్య మమేకమై తిరగడం రాధాకృష్ణకు జీర్ణం కాకపోవడంతో విశేషం ఏమీ లేదు! రాజకీయ చాణక్యుడని భజన మీడియాతో స్తోత్రాలు చేసుకునే చంద్రబాబు ఊహకు కట్టని వ్యూహాలతో చంద్రబాబును చావుదెబ్బ కొట్టాడనే పలుకులను రాధాకృష్ణ నోట వింటుంటే…ఆహా! శ్రీరాముడి చేతిలో చచ్చేముందు రావణాసురుడు…నారసింహుడి చేతిలో చచ్చేముందు హిరణ్యకశ్యపుడు నోరారా విష్ణునామం స్మరించినట్లు లేదూ?
***
“నాడు రాజశేఖర్ రెడ్డి ఫీజుల చెల్లింపులతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయడంతో పాటు పెద్దఎత్తున జలయజ్ఞం చేపట్టి ప్రాజెక్టులను నిర్మించడం వల్లనే ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు.ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయని అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు తెరమరుగైంది. “
రాజశేఖరరెడ్డి మళ్ళీ గెలిచిన రహస్యాన్ని ఛేదించిన రాధాకృష్ణ దాన్ని చంద్రబాబు చెవిలో చెప్పకపోవడంతో చంద్రబాబు గారు దారుణంగా ఓడిపోయారు. పోలవరాన్ని మార్చికల్లా పూర్తిచేస్తాము…రాసుకో జగన్…డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాము…రాసుకో జగన్ అంటూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ఉమా ప్రగల్భాలను ఎవరైనా మర్చిపోయారా? ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయిని అయిన పోలవరం చంద్రబాబు అయిదేళ్ల పాలనా కాలంలో ఎందుకు పూర్తి కాలేదు? జాతీయ హోదా దక్కినప్పటికీ, కేంద్రం నుంచి నిధులు సాధించి ఎందుకు పూర్తి చెయ్యలేదు? పోలవరం పేరుతో వేలకోట్ల రూపాయలను కాజేద్దామనే దురాశే తప్ప దాన్ని పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబుకు ఈ దుర్గతి సంభవించేదా?
***
“ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమాజం కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎప్పుడైనా ముప్పు ఏర్పడవచ్చన్న అభిప్రాయంతో జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుత మోడల్‌ను ఎంచుకొని ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిజంగా కన్నెర్ర చేస్తే రాష్ట్రానికి అప్పు కూడా పుట్టదు. ప్రతిపాదిత నీటి ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. సంక్షేమ పథకాలకు కూడా నిధుల కొరత ఏర్పడుతుంది. అదే జరిగితే జగన్‌మోహన్ రెడ్డికి ఉభయభ్రష్టత్వం ప్రాప్తిస్తుంది.”
హదీ….ఎన్ని సుద్దులు చెప్పినా, చంద్రబాబు ఓడిపోయాడనే వేదనతో ఎంతగా గుండెలు బాదుకున్నా చివరిగా తన మనసులోని మాట బయటపెట్టకుండా తన చెత్తపలుకుకు శుభం కార్డు వెయ్యలేడు రాధాకృష్ణ. ఏనాటికైనా కేంద్రప్రభుత్వం జగన్ మీద కన్నెర్ర చెయ్యాలని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోవాలని, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడాలని, జగన్‌మోహన్ రెడ్డికి ఉభయభ్రష్టత్వం ప్రాప్తించాలనేది రాధాకృష్ణ కోరిక.. ఆయన మనసులో రగిలే అగ్ని రావణాసురిడి కాష్టం లాంటిది! అది ఎన్నటికీ చల్లారదు…ఏంచేస్తాం… .పాపం!
****
ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా….పాడె మీద పడుకోబెట్టిన శవం తిరిగి లేస్తుందా?
ఎంత వగచినా, ఎంత వాపోయినా….నేలమీద ఒలికిన పాలను తిరిగి గిన్నెలోకి ఎత్తడం సాధ్యం అవుతుందా?
ఎంత గొంతు చించుకున్నా, ఎంత అరిచి గీపెట్టినా, చంద్రబాబును మళ్ళీ జనం విశ్వసిస్తారా?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు