మ్యాటర్ సీరియస్… ఏబీఎన్‌ వీడియోలు అడిగిన హైకోర్టు జడ్జ్!

దేవుడు నోరిచ్చాడు కదా అని నోటికేదొస్తే అది మాట్లాడకూడదని అంటుంటారు! వాక్ స్వాతంత్రపు హక్కు ఉందని… వెనకా ముందూ చిన్నా పెద్దా చూడకుండా నోరు జారితే తాట ఊడిపోద్దని చెబుతుంటారు! అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలన్నీ ఏబీఎన్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వారికి వర్తించేలా ఉన్నాయి! తాజాగా కొన్ని ఛానల్స్ లోని డిబేట్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది! హైకోర్టు న్యాయమూర్తులపై పిచ్చి పిచ్చి ప్రేళాపనలను చేసిన వారి వీడియోలను ఇవ్వాలని కోరింది!

వైఎస్ వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే దీనికి సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌ ఆర్డర్‌లో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది హాట్ టాపిక్ గా మారింది.

వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరుపుతున్నప్పటినుంచీ… అందులో అవినాశ్ పేరు వినిపిస్తున్నప్పటినుంచీ ఒకవర్గం మీడియాకు ఒంటిమీద బట్ట నిలవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే! అయితే మరిముఖ్యంగా “అవినాశ్ రెడ్డి అరెస్టు” అనే విషయంపై ఇప్పటికే పదుల సంఖ్యలో డిబేట్లు, వందల సంఖ్యలో వార్తలు రాసి జనాలపైకి వదిలేస్తుంది ఒక వర్గం మీడియా. ఇదే క్రమంలో తాజాగా ఈనెల 26వ తేదీన ఏబీఎన్‌, మహా టీవీ ఛానళ్లలో డిబేట్లు జరిగాయి.

ఈ డిబేట్లలో పాల్గొన్న వ్యక్తులు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్‌ ఒకరు.. “హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయి” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో… ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ఇవ్వాలని రిజిస్ట్రార్‌ కు న్యాయమూర్తి సూచించారు. అనంతరం ఆయా డిబెట్లపై న్యాయమూర్తి సీరియస్ గా స్పందించారు.

“మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. ఒక స్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ, సుప్రీం ఆదేశాలు, పవిత్రమైన న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించాను. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలా? వద్దా? అనేది హైకోర్టు నిర్ణయిస్తుంది” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాజా హైకోర్టు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. శృతిమించిన వ్యాఖ్యలు, నిస్సిగ్గు విశ్లేషణలపై ఆమాత్రం కటువుగా ఉండటం తప్పులేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. భాధ్యత కలిల్గిన ప్రభుత్వాలు కూడా ఇలాంటి పిచ్చి ప్రేళాపణలపై స్పందించాలని పలువురు కోరుతున్నారు.