మోడీని 11 భాషల్లో వాయిస్తున్న ఆప్!

గతకొన్ని రోజులుగా దేశప్రధాని మోడీపై పోస్టర్ ప్రచురించి ప్రశ్నించడం, విమర్శించడం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇందులో భాగంగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయంలో కవిత ను ఈడీ విచారిస్తున్న సందర్భంగా.. హైదరాబాద్ లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిసిన సంగతి తెలిసిందే. రావణుడిగా మోడీకి పదితలలు పెట్టి.. ఒక్కో తల ప్లేస్ లో సీబీఐ – ఈడీ – ఐటీ… ఇలా పెడుతూ ఫ్లెక్సీలు ఫిక్స్ చేశారు. అయితే ఎప్పటినుంచో అదేపనిలో బిజీగా ఉన్న ఆప్.. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది.

అవును… బీజేపీ, ఆప్ కి మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. మొన్నటివరకు ఢిల్లీకే పరిమితమైన ఈ వార్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. మోడీ పేరు చెబితే అంతెత్తునలేచే ఆప్ నేతలు… మోడీని ఢిల్లీవరకూ మాత్రమే విమర్శిస్తే సరిపోదని ఫిక్సయినట్లున్నారు. అందులో భాగంగా మార్చి 30న ప్రధాని మోడీకి వ్యతిరేకంగా దాదాపు అన్ని భాషల్లోనూ పోస్టర్లు అంటించాలని నిర్ణయించారు. ఈ పోస్టర్లు మొత్తం 11 భాషల్లో ప్రింట్ చేయిస్తున్నట్టుగా ఆప్ వెల్లడించింది. కొత్తగా ప్రచురిస్తున్న ఈ పోస్టర్లపై “మోడీ హఠావో, దేశ్ బచావో” అనే నినాదాలు ఉండడం గమనార్హం.

అంతకుముందు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గోడలు, విద్యుత్ స్తంభాలపై ఆప్ పోస్టర్లు అంటించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత “కేజ్రీవాల్ హఠావో, ఢిల్లీ బచావో” పేరుతో ఆప్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి బీజేపీ ప్రీతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో నాటి నుంచి ఆప్ – బీజేపీ మధ్య పోస్టర్ వార్ అవిరామంగా కొనసాగుతుంది. అయితే… అయినదానికీ కానిదానికీ పోలీసులను రంగంలోకి దింపే పేరుసంపాదించుకున్న మోడీ… ఈ విషయంలో ఊరుకుంటారా? లేదు రంగంలోకి దింపారు.

అవును… మోడీకి వ్యతిరేకంగా పలు నినాదాలతో పోస్టర్లు అంటించినందుకు గానూ ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 49 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదుఏశారు. ఈ అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనదైన రీతిలో స్పందించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఈ తరహా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదని.. స్వాతంత్ర్యానికి ముందు సైతం స్వాతంత్ర్య సమరయోధులు పోస్టర్లు అంటించేవారని.. బ్రిటిష్ వారు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.