దేవినేని ఉమా మహేశ్వరరావు మాజీ మంత్రి, టీడీపీ నేత. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ప్రస్తుత మంత్రి వైసీపీ నేత. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దేవినేని ఉమని అసభ్య పదజాలంతో దూషించడంలో కొడాలి నాని ప్రత్యేకమైన శద్ధ చూపిస్తుంటారు. తాజాగా మరోమారు కొడాలి నాని, దేవినేని ఉమపై విరుచుకుపడిపోయారు. ఇంటికొచ్చి మరీ బడితె పూజ చేస్తానంటూ హెచ్చరించేశారు మంత్రిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి సబబేనా.? అన్న ఇంగితం అస్సలేమాత్రం లేకుండా, మంత్రిగారు హద్దులు దాటేశారు. నిజానికి, కొడాలి నాని ‘అతి’ వైసీపీకి ప్రతిసారీ తలనొప్పులు తెచ్చిపెడుతూనే వుంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కొడాలి నాని విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే, కొడాలి నానితో పెట్టుకుంటే మేటర్ ఇంకోలా వుంటుంది. కొడాలి నాని నోటికి హద్దూ అదుపూ వుండదు. బూతులు అవలీలగా ఆయన నోట వచ్చేస్తుంటాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన.. హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించి అదికార పార్టీని ఇంతలా ఇరుకున పెడుతున్నాయంటే, అందుక్కారణం, కొడాలి నాని గతంలో దేవతా మూర్తుల విగ్రహాల్ని బొమ్మలతో పోల్చడం వల్లనే. ఇక, ఇప్పుడు ఈ బడితె పూజ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
ఎంత మంత్రి అయితే మాత్రం, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిపై బడితె పూజ చేస్తాననడం ఎంతవరకు సబబు.? రాజకీయాల్లో అస్సలేమాత్రం సబబు కాదిది. మంత్రి, తన బాధ్యతల్ని విస్మరించి వ్యవహరించడం జుగుప్సాకరమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. నిజానికి, అధికార పార్టీ నేతలు కూడా కొడాలి నాని తీరుని మనస్ఫూర్తిగా క్షమించలేని పరిస్థితి. ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు.. అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తాయి. మంత్రి పదవిని కాపాడుకునేందుకో, మరో కారణంతోనో కొడాలి నాని హద్దులు దాటుతున్నారుగానీ.. ఆయన వైఖరి పార్టీని అనూహ్యంగా దెబ్బతీస్తోందని మాత్రం గుర్తించలేకపోతున్నారు. వున్నపళంగా ఇప్పుడు దేవినేని ఉమ పొలిటికల్ హీరో అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొడాలి తీరుకి నిరసనగా మాజీ మంత్రి దేవినేని ఉమ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు మరి.