దర్శకత్వం : కేథరిన్ బిగేలో
తారాగణం : ఇడ్రిస్ ఎల్బా, రెబెక్కా ఫెర్గూసన్, గాబ్రియేల్ బాసో, జారెద్ హారిస్, ఆంథోనీ రామోస్,
రచన ల సంగీతం : వోల్కర్ బెతెల్మన్, ఛాయాగ్రహణం : బారీ అక్రోయిడ్
బ్యానర్స్ : ఫాస్ట్ లైట్, ప్రోలాగ్ ఎంటర్ టైన్మెంట్, కింగ్స్ గేట్ ఫిలిమ్స్
విడుదల : అక్టోబర్ 24, 2025 -నెట్ ఫ్లిక్స్
కథేమిటి?
కెప్టెన్ ఒలివియా వాకర్ వైట్ హవుస్ లో వాచ్ రూమ్‌లో సీనియర్ ఆఫీసర్.. ఆమె ఉదయం తొమ్మిదిన్నరకి రాడార్ లో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ని గుర్తిస్తుంది. మొదట్లో అదో సాధారణ ఉత్తర కొరియా జరుపుతున్న క్షిపణి పరీక్ష కావచ్చునుకుంటుంది. కానీ దాని ప్రయాణ మార్గం దిశ మార్చుకోవడంతో అది షికాగో నగరాన్ని టార్గెట్ చేసుకుని దూసుకొస్తోందని అర్ధమవుతుంది. అంటే ఇంకో 18 నిమిషాల్లో షికాగో గగన తలాన్ని తాకుతుందన్న మాట. వెంటనే వ్యవస్థల్ని అప్రమత్తం చేస్తుంది. డిఫెన్స్ సెక్రెటరీ, వివిధ వార్ కమాండ్స్ సహా అమెరికా అధ్యక్షుడు అప్రమత్తమవుతారు. కానీ క్షిపణిని ఏ దేశం ప్రయోగించిందో తెలుసుకోలేక పోతారు. ఇక అలస్కా లోని సైనిక స్థావరానికి ఆదేశాలిస్తారు. మేజర్ డేనియల్ గొంజాలేస్ సిబ్బంది దూసుకొస్తున్న ఆ క్షిపణి మీదికి రెండు ఇంటర్ సెప్టర్స్ ని ప్రయోగిస్తారు. రెండూ క్షిపణిని తాకకుండా మిస్సవుతాయి. అప్పుడేం జరిగింది? ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని ఆపగలిగారా? అసలు క్షిపణిని ప్రయోగించిందెవరు? ఏదైనా శత్రు దేశమా? లేక ఉగ్రవాద సంస్థా? ఈ దాడిని అధ్యక్షుడు ఎలా తిప్పి కొట్టాడు? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ?
ఆస్కార్ అవార్డు గ్రహీత, దర్శకురాలు కేథరిన్ బిగేలో మరో డైనమైట్ లాంటి కథతో అలజడి రేపుతోంది…. పూర్తిగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ రూల్స్ ని బ్రేక్ చేసి- మూడు సార్లు అక్కడికే వచ్చి ఆగే మూడంకాలతో ముగింపు లేకుండా కొత్త ప్రయోగం చేసి షాకిచ్చింది. షికాగో నగరం మీదికి ఎవడో శత్రుదేశం వాడు ప్రయోగించిన మిసైల్ దూసుకోస్తోంది… 18 నిమిషాలే టైముంది…అంత అమెరికా డిఫెన్స్ వర్గాలు శత్రు దేశమేదో కనుక్కోలేకపోతారు. రష్యా ? చైనా? ఇరాన్? ఉత్తర కొరియా? తెలీదు! కానీ అమెరికా దాడి జరగవచ్చని సందట్లో సడేమియా లాగా పాకిస్తాన్ వాడు దళాల్ని అప్రమత్తం చేస్తాడు….ఫలితంగా అమెరికన్లు ఎదురు దాడి చేయలేకపోతారు. దూసుకొస్తున్న మిసైల్ ని కూల్చే రెండు ప్రయత్నాలూ విఫల మవుతాయి. అంతా వీక్నెస్సే…అమెరికన్ల వీక్నెస్సులు! చివరికి బెంబేలెత్తిన ప్రెసిడెంట్ కి రెండే ఆప్షన్స్ ఇస్తారు అధికారులు. ఆ రెండిట్లో దేన్ని ఓకే చేశాడు? ఏమో! షికాగో నగరం వుందా, పేలిపోయిందా? ఏమో! పెద్ద అణ్వస్త్ర యుద్ధం మొదలైపోయిందా? ఏమో! ఈ ఏమోలతో అర్ధోక్తిలో కథ ఆపేసి, ఇంకో కుటుంబానికి చెందిన మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ – షాకింగ్ సంఘటనతో హృదయ విదారక ముగింపుని ప్రేక్షకులకే వదిలేసింది దర్శకురాలు…
స్క్రీన్ ప్లే తో కొత్త ప్రయోగం!
సాధారణంగా కథ ప్రారంభమై పాత్రలు ఒక సమస్యలో పడ్డాక స్క్రీన్ ప్లేలో కథ కి ఫస్ట్ యాక్ట్ ముగుస్తుంది. సెకండ్ యాక్ట్ లో ఆ సమస్యతో పోరాటం వుంటుంది. థర్డ్ యాక్ట్ లో ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఈ విధంగా వుంటుంది. కానీ ఈ సినిమాలో ఫస్ట్ యాక్క్టే మూడు సార్లు రిపీటవుతుంది. మొదట ఫస్ట్ యాక్ట్ లో రెబెక్కా దృక్కోణం లో కథ నడిచి శత్రు క్షిపణి మీద దాడి మిస్సవడం తో ఫస్ట్ యాక్ట్ ముగుస్తుంది.
ఇక సెకండ్ యాక్ట్ ఈ సమస్యతో పోరాటం తీవ్రమై కథ ముందు కెళ్ళాలి. ఇలా జరగదు. మళ్ళీ ఫస్ట్ యాక్టే ఈ సారి అధికారుల దృక్కోణంలో మొదలవుతుంది. ఇది కూడా శత్రు క్షిపణి మీద రెండు ఎదురు దాడులు మిస్సవడం దగ్గర వచ్చి ఆగుతుంది. ఇక ఇప్పుడైనా సమస్యతో పోరాటం కొనసాగకుండా మళ్ళీ ఫస్ట్ యాక్ట్ మొదలవుతుంది. ఈసారి ప్రెసిడెంట్ దృక్కోణంలో మళ్ళీ మొదలై శత్రు క్షిపణి మీద ఎదురు దాడి మిస్సవడంతో ఆగి- ఇప్పుడు క్లయిమాక్స్ మొదలవుతుంది…

ఇలా పదే పదే కథ రిపీటవడంతో మొదట ప్రారంభమైన ఫస్ట్ యాక్ట్ లోని బలం, థ్రిల్, సస్పెన్స్ తర్వాతి రిపీటీషన్స్ లో కనిపించవు. కానీ క్లయిమాక్స్ లో ఏం జరుగుతుందా అని చూస్తె దానికి ప్రెసిడెంట్ తో కూడా ముగింపు లేకుండా- ముగింపుని ప్రేక్షకులకే వదిలేశారు. అయితే వేరే అధికారి కుటుంబ సెంటి మెంటుతో ట్రాజిక్ ముగింపు ఇవ్వడం బలమైన ఇంపాక్ట్ నిస్తుంది.
మహా అయితే ప్రెసిడెంట్ తనకున్న రెండు ఆప్షన్స్ తో ఏం చేయగలడు శత్రు దేశాన్ని కనిపెట్టి దాని మీద దాడి చేయగలడేమో, ,లేదా సర్వ శక్తులూ ఒడ్డి క్షిపణిని కూల్చగలడేమో.
ఈ రెండిట్లో ఏది జరిగినా ప్రేక్షకులకి రొటీనే. అందుకని ఏం జరిగి వుండొచ్చో తేల్చకుండా ప్రేక్షకుల ఊహకే వదిలేసింది దర్శకురాలు.
ఇందువల్లే ఇది సినిమాల్లో రొటీన్ గా చూపించే అమెరికా హీరోయిజాన్ని పక్కనబెట్టి, ప్రశ్నల్ని రేకెత్తిస్తున్న న్యూక్లియర్ థ్రిల్లర్ గా సంచలనం సృష్టిస్తోంది.
రేటింగ్: 3 .5 /5

