ధోనీ వీడ్కోలుతో ఒక శకం ముగుసింది.. 90ల క్రికెట్ ప్రేమికుల మనోవేదన 

India national cricket team
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ లాంటి ఎందరో గొప్ప ఆటగాళ్లు, కపిల్ దేవ్, గంగూలీ లాంటి మెరుగైన కెప్టెన్లు ఉన్నారు.  అయినా మహేంద్రసింగ్ ధోనీ పేరు మాత్రం ప్రత్యేకం.  కారణం అద్భుతమైన ఆటతీరుతో పాటు అసామాన్యమైన నాయకత్వ లక్షణాల కలబోత అతడు.  అందుకే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అతను సారథ్యం వహించిన కాలం గోల్డెన్ పీరియడ్ అంటుంటారు.  అప్పటివరకు మంచి జట్టుగా మాత్రమే ఉన్న ఇండియాను ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలబెట్టాడు.  ఒక ఐసీసీ ట్రోఫీ గెలవడమే గగనం అనే రోజుల్లో ఏకంగా మూడు ట్రోఫీలు గెలిపించి అందనంత ఎత్తులో భారత జట్టును నిలబెట్టాడు.  వన్డే, టీ20, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా బెస్ట్ ఫినిషర్ అనే పేరు గడించాడు.  90ల క్రికెట్ ప్రేమికులకు టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మర్చిపోలేని అనుభూతులను అందించాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే ధోనీ సాధించిన ఘనతలు అనేకం. 
India national cricket team
అలాంటి గొప్ప ఆటగాడు నిన్న రాత్రి ఉన్నట్టుండి తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు.  ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా ధోనీ చేసిన ఈ ప్రకటనతో అభిమానులు షాకయ్యారు.  ఎలాంటి ప్రెస్ మీట్ లేదు, వీడ్కోలు సంబరాలు లేవు, సహచరులతో సమావేశం లేదు.  ఒక గొప్ప క్రికెటర్ ఇలా సాధారణ రీతిలో నిష్క్రమించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  గతంలో పలుమార్లు ధోనీ రిటైర్మెంట్ మీద వార్తలు వచ్చినా ఇంకో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడతాడని అభిమానులు భావించారు.  నిజానికి ధోనీ ప్లాన్ కూడా అదే.  ఐపీఎల్ కోసం సన్నద్దమయ్యాడు కూడ.  కానీ కరోనా కారణంగా లీగ్ వాయిదా పడటంతో పాటు టీ20 కప్ కూడా వచ్చే యేడాదికి మారింది.  దీంతో ధోనీ తన నిర్ణయాన్ని మార్చుకుని, ఇక వేచి చూడటం వలన ప్రయోజనం లేదనుకుని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.  
India national cricket team
రాంచీ అనే చిన్న నగరం నుండి వచ్చి ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ధోనీ ప్రయాణం ఎంతో స్పూర్తిదాయకం.  2004లో 23 ఏళ్ళ వయసులో భారత జట్టులో అడుగుపెట్టిన ధోనీ అదే సంవత్సరం విశాఖలో పాక్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో 148 పరుగులతో విధ్వంసం సృష్టించి దేశం దృష్టిని ఆకర్షించాడు.  ఆ తర్వాత టీ20 ఫార్మాట్లో ధోనీ చేతికి పగ్గాలిచ్చింది బోర్డు.  ఆ క్షణమే భారత జట్టు కొత్త శకంలోకి అడుగుపెట్టింది.  మునుపెన్నడూ చూడని విజయాలను అందుకుంది.  పూర్తి సామర్థ్యం కలిగిన నాయకుడిని చూసింది.  ఎంతటి సంక్షోభంలో అయినా నిమ్మళంగా కనబడుతూ సాధారణ నిర్ణయాలు తీసుకుని జట్టును విజయ తీరాలకు చేరుస్తూ కెప్టెన్ కూల్ అనే పేరు తెచ్చుకున్నాడు.  
India national cricket team
సీనియర్లకు కెప్టెన్ గా తన జూనియర్ ఆటగాళ్ల కెప్టెన్సీలో ఒక ఆటగాడిగా మెలిగిన అద్భుతమైన క్రమశిక్షణ ధోనీ సొంతం.  ఒక్కసారి ధోనీ ట్రాక్ రికార్డ్ చూస్తే 350 వన్డేల్లో 10,773 పరుగులు చేసిన ధోనీ 90 టెస్టుల్లో 4,876 పరుగులు, 98 టీ-20 మ్యాచ్‌ల్లో 1,617 పరుగులు.  వన్డేల్లో ధోనీ అత్యధిక స్కోర్ 183 నాటౌట్ కాగా టెస్టుల్లో అత్యధిక స్కోర్ 224, టీ-20లో అత్యధిక స్కోర్ 56.  టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేశాడు.  టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు, వన్డేల్లో 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లు టీ-20ల్లో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు ఖాతాలో వేసుకున్నాడు.  2007లో టీ-20, 2011లో వన్డే వరల్డ్ కప్‌లు, 2013లో ఛాంపియన్ ట్రోఫీ సాధించిన ధోనీని 2007-08లో  రాజీవ్ ఖేల్‌రత్న 2009లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్‌ అవార్డులు వరించాయి.