కార్గిల్ విజయ్ దివస్.. పాక్ సైన్యాన్ని ప్రాణ భయంతో పరుగులు పెట్టించిన రోజు 

21 years for Kargil victory

సరిగ్గా 21 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారత్‌ను కుట్రపూరిత చర్యతో దొంగదెబ్బ తీయాలనుకున్న పాకిస్థాన్ సైన్యాన్ని ప్రాణ భయంతో పరుగులు పెట్టేలా చేసింది.  కార్గిల్ యుద్దంలో మన సైనికులు ప్రాణాలకు తెగించి చూపిన ఆ తెగువకు, ధైర్య సాహసాలకు, అమరులైన సైనికుల త్యాగాలను గౌరవించుకోవడానికి ఈ జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ జరుపుకొంటున్నాం.  ఈ సందర్బంగా ఆనాడు యుద్దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, పాక్ పన్నిన కుట్ర ఎలాంటిది, దాయాది దేశానికి భారత సైన్యం ఎలా బుద్ది చెప్పింది, అసామాన్య పరిస్థితుల్లో కూడా మన సైనికులు ఎలా గెలిచారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 

 
హిమాలయ పర్వత ప్రాంతాల్లోని భారత్, పాక్ సరిహద్దుల వద్ద పాక్ సైనికులు సరిహద్దు రేఖ దాటి లోపలికి చొచ్చుకురావడాన్ని ఒక గొర్రెల కాపరి గమనించి సమాచారాన్ని భారత సైనిక శిబిరానికి అందించాడు.  ఆ సమాచారంతో సరిహద్దు వద్దకు వెళ్లిన కొందరు సైనికులను పాక్ ఉగ్రమూకలు, సైన్యం కలిసి మట్టుబెట్టాయి.  అదే కార్గిల్ యుద్దానికి కారణమైంది.  నియంత్రణ రేఖ వెంబడి ఉండే సైనిక శిబిరాలను శీతాకాలంలో ప్రతికూల వాతావరణం దృష్ట్యా తొలగించాలి అనేది ఇరు దేశాల మధ్య ఒప్పందం.  ఒప్పందం మేరకు ఎప్పటిలాగే భారత్ తన సైనిక శిబిరాలను తొలగించింది.  కానీ పాక్ ఆ ఒప్పందాన్ని మీరి ఉగ్రవాదులతో కలిసి సరిహద్దు దాటి భారత భూభాగాన్ని 5 కిలోమీటర్ల మేర  ఆక్రమించారు.  పైగా మన సైనికులకు కిరాతకగా  చంపారు.  
 
దీంతో భారత సైన్యం బలగాలను రంగంలోకి దింపింది.  కానీ పాక్ ముందుగానే చేసిన ఈ కుట్రలో పాక్ బలగాలు మంచు కొండల పైన, భారత సైన్యం కొండల కింద.  ముఖాముఖి తలపడటానికి వీలులేని ఆ పరిస్థితులు.  అయినా మన సైన్యం వెనక్కు తగ్గలేదు.  పాక్ సైన్యాన్ని నిలువరిస్తూనే మంచు కొండల మీదికి చేరుకుంది.  అక్కడే నక్కిన ఉగ్రవాదులు, పాక్ సైన్యాన్ని మట్టుబెట్టింది.  కార్గిల్ భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకుంది.  చివరికి ఓడిపోతామని తెలుసుకున్న పాక్ ఓటమితో కాకుండా కాల్పుల విరమణతో వెనక్కి తగ్గితే పరువు ఉంటుందని మధ్యవర్తిత్వం కోసం అగ్రరాజ్యం అమెరికా సాయం కోరింది.  కానీ అమెరికా అందుకు నిరాకరించింది.  
 
చివరికి పాక్ యుద్దంలో ఓటమి పాలైంది.  విజయం అనంతరం జూలై 26న భారత సైన్యం మన భూభాగంలోకి చొరబడిన పాక్ సైన్యాన్ని అన్ని ప్రాంతాల నుండి తరిమికొట్టింది.  తోకముడిచిన దాయాది సైన్యం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టింది.  73 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో భారత సైనికులు 500లకు పైగా అమరులవగా పాక్ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.  ఈ యుద్దంతో భారత ధైర్య సాహసాలేమిటో శత్రు దేశానికి పూర్తిగా తెలిసొచ్చింది.  ఈ యుద్దం విజయం భారత చరిత్రలో సగర్వంగా నిలిచిపోయింది.  ఈ విజయాన్ని గుర్తుచేసుకున్నప్పుడల్లా భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి.