వైసీపీ, టీడీపీ..నేతల మైండ్ సెట్ మారాలి
రాజకీయ నాయకుల్ని చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అదికారం లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తుంటారు. ఈ మార్పుకు కారణం అధికారమే. ఇందుకు క్లసికల్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ హాట్ టాపిక్ అయిన సోషల్ మీడియాపై ఆంక్షలు, కేసులు, అరెస్టులు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేసినా, జనంలో అపోహలు పెంచేలా తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని అంటోంది. కొందరిపై చర్యలు కూడా తీసుకుంటోంది. ఈమధ్యే గుంటూరులో పూందోట రంగనాయకమ్మ అనే 60 ఏళ్ల మహిళపై సీఐడీ కేసు నమోదైంది. ఆమె ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని అధికారులు కేసు నమోదు చేశారు.
ఇక ఆమె తరపున వకాల్తా పుచ్చుకున్న టీడీపీ ప్రజల భావ ప్రకటనా హక్కులకు జగన్ భంగం కలిగిస్తున్నారని, వ్యతిరేకంగా మాట్లాడితే కక్షపూరితంగా కేసులు పెడతారా అంటూ వాపోతోంది. ఇది మాత్రమే కాదు టీడీపీకి మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఇంకొందరు సోషల్ మీడియా వ్యక్తుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ఖండిస్తున్న టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ సర్కార్ ఎలా చేసిందో అలానే కొందరు వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద విరుచుకుపడింది. అప్పుడు చంద్రబాబు సీఎం హోదాలో పెద్ద మీటింగ్ పెట్టి మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, చేతికొచ్చిన రాతలు రాస్తే ఊరుకోవాలా అన్నారు. ఇప్పుడేమో వైసీపీవి కక్షపూరిత చర్యలని గగ్గోలు పెడుతున్నారు.
జగన్ బృందానిది కూడా అదే తీరు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఇలాంటి కేసులు పెడితే చంద్రబాబుది రాక్షస పాలనని దుమ్మెత్తిపోసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాళ్లూ కేసులు పెడుతున్నారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హక్కుల గురించి మాట్లాడిన నాయకులు అధికారం వచ్చాక చట్టాల గురించి మాట్లాడటం చూస్తున్న జనానికి అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది. ఇలా నాయకుల్లో ఊహించని ఈ మార్పుకు కారణం అధికారమే. అధికారం లేనప్పుడు సౌమ్యంగా, సామాన్యంగా కనిపిస్తూ మానవతా దృక్పథంతో మాట్లాడే నేతల మైండ్ సెట్ అధికారంలోకి రాగానే ఆ మాయలో పడి ఒక్కసారిగా మారిపోతుంది.
ఈ మార్పు మానవ నైజం. మనిషి అసౌకర్యంలో ఉన్నప్పుడు విలువల గురించి, సకల సౌకర్యాలు ఉన్నప్పుడు రూల్స్ గురించి మాట్లాడతాడు. అలాగే నేతలు కూడ. ఎవరైతే అధికారపు మాయలో పడతారో వారిలోనే ఇలాంటి మార్పు కనిపిస్తుంది. అలాగని అందరు నాయకులు ఆ మాయలో పడతారని కాదు..మెజారిటీ వ్యక్తులు పడతారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే నాయకుల మైండ్ సెట్ మారాలి. అలా జరగాలంటే నేతలు తమ ఆలోచనల్ని సంస్కరించుకోవాలి. అప్పుడే ఆ మాయ నుండి తప్పించుకోగలరు. అలా తప్పించుకున్నప్పుడే రూలింగ్ పార్టీగా ప్రజలిచ్చిన అధికారాన్ని సమర్థంగా, శ్రేయస్కరంగా ఎలా వాడాలి అనేది వారికి స్పష్టంగా తెలుస్తుంది.