ట్విట్టర్లో తనకంటే గొప్పగా ఎవరూ ట్వీట్లు వేయలేరని, తాను మాట్లాడినన్ని లాజిక్కులు ఎవరూ మాట్లాడలేరని వైకాపా నేత విజయసాయిరెడ్డిగారి ప్రగాఢ విశ్వాసం. వైకాపా సోషల్ మీడియాను నడిపేది తానేనని, అదొక సైన్యమని ఫీలైపోయే సాయిరెడ్డిగారు నిత్యం ఎవరో ఒకరి మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ విమర్శలు చాలా వరకు ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టేవి నవ్వుకునేవిగా ఉంటాయి తప్ప ఆలొచించేలా చేసేవిగా ఉండవు. ఇన్నాళ్ళు టీడీపీ, జనసేనల మీద తన ట్వీట్ల ప్రతాపం చూపిన విజయసాయిరెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద పడ్డారు.
Read More : రేవంత్ కి కరోనా కలిసొచ్చే అంశమే !
ఈమధ్యే టీడీపీ మిడతల దండు కమలం మీద వాలుతోందంటూ సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ లాంటి రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన విజయసాయి తాజాగా కన్నా లక్ష్మీనారాయణ మీద పడ్డారు. ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా ? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్నఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా అంటూ పెద్ద విమర్శే చేశారు.
Read More : ‘పుష్ప’ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ ?
ఈ ట్వీట్లో కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుతో కుమ్మక్కై రాష్ట్రంలో భాజపాను లేకుండా చేసే కుట్ర చేస్తున్నారనే అర్థం ఉంది. ఇది బీజేపీ పట్ల కన్నా విధేయతను, విశ్వసనీయతను అనుమానించడమే అవుతుంది. 2014లో బీజేపీలో చేరిన ఆయన అప్పటి నుండి ఇప్పటివరకు అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. హైకమాండ్లో ఆయనను నమ్మే నాయకులు చాలామందే ఉన్నారు. అందుకే సాయిరెడ్డి ఈ ట్వీట్ వేసిన వెంటనే భాజపా జాతీయ సెక్రెటరీ సునీల్ దియోధర్ స్పందించారు. కేవలం పసుపు రంగునే కాదు అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది. ప్రస్తుతం ఎంపీ రాఘురామకృష్ణరాజు ఫేడ్ చేస్తున్న మీ రంగును మీరు కాపాడుకోండి అంటూ నానార్థాలు వెతుక్కోగల కౌంటర్ ఇచ్చారు.
Read More : బాబు పాత ధీమా.. జగన్ కొత్త వ్యూహం !
రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న వైకాపా సొంత కారణాలు, రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా కేంద్రంలో మాత్రం బీజేపీకి విధేయంగానే ఉంది. పలు బిల్లులలో భాజపాకు మద్దతిస్తోంది. ఆ కారణం మూలంగానే బీజేపీ రాష్ట్రంలో ద్వంద వైఖరి కొనసాగిస్తూ ఎవ్వరినీ నొప్పించక తానొప్పక అనే రీతిలో రాజకీయం చేస్తోంది. ఆవసరం వచ్చినప్పుడు కమలం ఎటు మళ్లుతుందో చెప్పడం కష్టం. అందుకే ఆ పార్టీ మీద టీడీపీయే కాదు ఇప్పటి వైకాపా కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఉన్నట్టుండి విజయసాయిరెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీదే విమర్శకు దిగి రెచ్చగొట్టే ట్వీట్లు వేయడం చూస్తే కమలంతో సున్నం పెట్టుకోవాలనే కోరిక బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
మరి ఇది సాయిరెడ్డి సొంత కోరికా లేకపోతే వెనక జగన్ ఉన్నారా అనేది తెలీదు కానీ ఇలా చేయడం వలన కమలంతో సాగిస్తున్న అనధికారిక దోస్తీకి ఫులుస్టాప్ పడేలా ఉంది. అసలే బీజేపీని నమ్ముకుని రెబల్ ఎంపీ రఘురామరాజు మీద అనర్హత వేటు వేయాలని వైకాపా అధిష్టానం భావిస్తోంది. కానీ ఇప్పుడు సాయిరెడ్డి తీరు చూస్తే కష్టమైన ఆ పని ఖచ్చితంగా జరగదని అనిపిస్తోంది. ఇక మూడు రాజధానుల విషయంలో సహకారం, కేంద్ర నిధుల విడుదల, ఇతర వ్యక్తిగత ప్రయోజనాలు లాంటివి ఉన్నాయి. వాటిని కూడా విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేలా ఉంది సాయిరెడ్డిగారి తీరు.