బిజెపి – వైకాపా పార్టీల మధ్యనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నట్లు రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఏంజరిగినా కేంద్రంతో సంప్రతించే చేస్తున్నామనే బిల్డప్ వైకాపా నాయకత్వం ఇచ్చేది. అలాంటప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో రాష్ట్రంలో కూడా ఎవరైనా సత్సంబంధాలు కలిగివుండాలి. కాని వైకాపాది అంతా రివర్స్ కాబట్టి రాష్ట్రంలో ఉప్పు నిప్పుగా తయారైనారు. అదే ఈ నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైనస్ పాయింట్ గా మిగలబోతోంది.
అదే సమయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైకాపా నాయకత్వం దూకుడు పెంచి తుదకు చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయాడనేంత వరకు ఆరోపణల పర్వం కొనసాగించింది. దానికి తగ్గట్టు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివియల్ నరసింహారావు ప్రకటనలు వైకాపాకు బలం చేకూర్చుతూ వచ్చాయి. (గమనార్హమైన అంశమేమంటే మారిన పరిస్థితుల్లో ఈ జాతీయ ప్రతినిధి ఇటీవల కాలంలో పత్తాలేకుండా పోయారు) . రాష్ట్రంలో వైకాపా నాయకత్వం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులపై విమర్శలు గుప్పిస్తుండిన సమయంలోనే బిజెపి మరొక జాతీయ నేత రాం మాధవ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగుడుతూ చేసిన ప్రకటనను వైకాపా పార్టీ తన మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇరకాటంలో పడ్డారు.
Read More : షోకాజ్ నోటీస్ పై వైకాపా ఎంపీ సెటైర్లు
రాష్ట్ర పార్టీతో నిమిత్తం లేకుండా కేంద్రంలో నరుక్కు రావచ్చనే ధోరణిలో వైకాపా నేతలు వ్యవహరించారు.అంతేకాదు. కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించి కొత్త అధ్యక్షుడ్ని నియమిస్తారని కూడా వైకాపా వర్గాలు విస్త్రుతంగా ప్రచారంలో పెట్టాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర బిజెపి శ్రేణులలో అయోమయం చోటు చేసుకొండి. మరో వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దూకుడు పెంచి శాసన మండలిని రద్దు చేసి కేంద్రానికి పంపారు. వెంటనే కేంద్రం ఆమోదం లభించుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఉరుములు లేకుండా పిడుగులు పడినట్లు చకచక పలు సంఘటనలు సంభవించాయి.
Read More : డబ్బుపై కసితో రగిలిపోతున్న కంగన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించినట్లు శాసన మండలి రద్దుకు కేంద్రం కనీస చర్యలు చేపట్టలేదు. కోల్డ్ స్టోరేజిలో పడేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వద్ద అపాయింట్ మెంట్ పొంది అపరిష్కృత సమస్యలకు పరిష్కారం పొందడంతో పాటు రాష్ట్ర బిజెపి నాయకులకు చెక్ పెట్టాలని ఆశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. ఎవరైనా విఐపి తీరిక లేదని అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడం సహజం. కాని ఒక ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇచ్చిన హోంమంత్రి ఆఖరు నిమిషంలో రద్దు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నది. వాస్తవంగా ఏం జరిగిందో ఏమో గాని రాజకీయ వర్గాలు మాత్రం ఈ సంఘటనపై చిలవలు పలవులుగా కథనాలు వండి వార్చాయి. ఇది వైకాపాకు మైనస్ గా మిగిలింది.
హోం శాఖ మంత్రి అపాంట్ మెంట్ తామే రద్దు చేయించామని రాష్ట్ర బిజెపి నేతలు కాలరు ఎగరేసి లీకులు వదిలారు.ఇదిలా వుండగా వైకాపా ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ నేత రాంమాధవ్ తను చెప్పిన శుభాకాంక్షలను దుర్వినియోగం చేశారనే ధోరణిలో మరో ప్రకటన చేయడం ముఖ్యమంత్రికి మింగుడు పడనిదిగా తయారైంది. ఎవరైనా జన్మదినోత్సవం జరుపుకొంటూ వుంటే చెప్పే శుభాకాంక్షలు ఆయన అంతా బాగా చేస్తున్నట్లు కాదని రాంమాధవ్ చేసిన ప్రకటన వైకాపాకు పుండుపై కారం రాసినట్లయింది.
ఈ సందర్భంలో మరో ట్విస్ట్ సంభవించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తొలగించే సందర్భంగా తాము కేంద్రంతో సంప్రతించే చేశామని వైకాపా నాయకత్వం లీకులు వదిలింది. ఒక వేపు రాష్ట్ర బిజెపి నాయకత్వం రమేష్ కుమార్ తొలగింపుకు వ్యతిరేకంగా పోరాడుతూ వుంటే కేంద్రం ఆమోదం వుందనే లీకులు రాగానే రాష్ట్ర ప్రజల్లో బిజెపికి అంతంత మాత్రంగా వున్న పరువు పూర్తిగా పోయింది. ఇదంతా చక్కదిద్దేందుకే కేంద్ర హోం శాఖ మంత్రి ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇచ్చి రద్దు చేశారని రాష్ట్ర బిజెపి నేతలు మరో రకంగా లీకులు వదిలారు. పైగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు కేంద్ర నాయకత్వం ఆమోదంతోనే తాను హైకోర్టులో రమేష్ కుమార్ కు అనుకూలంగా కేసువేసినట్లు ప్రకటించి రాష్ట్రంలో పోయిన పరువు కాపాడేందుకు తంటాలు పడ్డారు.
తమాషా ఏమంటే రాష్ట్రంలో బీజేపీ వైకాపా పార్టీలు పోట్లాడుకుంటూ వుంటే కేంద్రంలో మాత్రం ఇటీవల వరకు మార్జాల దాంపత్యం కొనసాగుతూ వుండి ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో పరాకాష్టకు చేరింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన దైన శైలిలో గేము ఆడారు. ప్రత్యేక హోదా ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో మున్ముందు (రాజ్యసభ) తమ అవసరాలు కేంద్రానికి వచ్చినపుడు ప్రత్యేక హోదా సాధించుతానని పరోక్షంగా కేంద్ర బిజెపి నాయకులు హెచ్చరిక పంపారు. అంతే కాదు. కేంద్రంలోని బిజెపి నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యన్ ఆర్ సి(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ షిప్పు) కు వ్యతిరేకంగా మొన్న జరిగిన శాసనసభ సభ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. ఇది ఒక రకంగా కేంద్ర బిజెపి నాయకులకు మింగుడు పడని అంశమే.
పులి మీద పుట్ర లాగా తయారైన వైకాపా పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణమ రాజు ఎపిసోడ్ ఏదరికి చేరుతుందో చూడాలి. ఏ పక్షంలోనూ ఆయన వైకాపాలో కొనసాగే అవకాశాలు లేవు. పార్టీనుండి సస్పెండ్ చేసి సమయం చూచి వేటు వేస్తే బిజెపి నాయకత్వ వైఖరి ఏవిధంగా స్పందించుతుంది? . లేదా ఆయనను బిజెపి తన అక్కున చేర్చుకుంటుందా? ఇవన్నీ భవిష్యత్తు తేల్చవలసివుండగా ఉరుములు లేకుండా పిడుగులు పడినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బాంబులు కాదు. ఏకంగా ఆటం బాంబులు పేల్చి వెళ్లారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైకాపా పాలనపై అంత ఘాటు పదాలు వాడలేదేమో. తెలుగు నిఘంటువులో వుండే పదాలన్నీ ప్రయోగించారు. కేంద్ర నాయకత్వం ఆమోదం లేనిదే మంత్రి కిషన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడే అవకాశం లేదు.
“ఎపిలో అభివృద్ధి వ్యతిరేక పోలీసు పాలన నడుస్తోంది. అవినీతి అహంకారం అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి. మద్యం ఇసుక భూమాఫియా చెలరేగు తున్నాయి. అరాచకాలు దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోతోంది. ” ఇదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగ పాఠం. పోలీసులే తమను వేధిస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని కూడా పేర్కొన్నారు. ఇది కొసమెరుపు.ఇంకా బిజెపి – వైకాపా పార్టీల మధ్య హనీమూన్ సాగుతుందా?