పాలనలో గవర్నర్ జోక్యం.. భాజపా పెత్తనం ఒప్పుకోని కేసీఆర్

తెలంగాణలో రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్ రాజకీయంగా కూడా కొత్త విభేదాలకి తెర తీస్తోంది.  హైదరాబాద్లో కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతుండటం, పరీక్షలు, చికిత్స, నివారణ చర్యల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.  ప్రజల్లో సైతం అసహనం పెరిగింది.  సోషల్ మీడియాలో గవర్నర్ అందుబాటులోకి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా పరీక్షలకు, చికిత్సకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని గవర్నర్ తమిళసైకి నెటిజన్లు పెద్ద ఎత్తున పిర్యాధులు చేశారు.  దీంతో గవర్నర్ ఉన్నట్టుండి చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీని సమీక్షకు రావాలని కోరారు.  
 
ఇలా గవర్నర్ నేరుగా రంగంలోకి దిగడం, సమీక్షకు పిలవడంతో ప్రభుత్వ పెద్దలు షాకయ్యారు.  ఆ తర్వాత తేరుకున్న సీఎస్ హెల్త్ సెక్రెటరీ ఇద్దరూ ముందుగా కొన్ని ముఖ్యమైన పనులు నిర్దేశించుకోవడంతో సమీక్షకు రాలేమని సమాధానం పంపారు.  ఆ సమాధానంతో గవర్నర్ అసంతృప్తి చెందారనే టాక్ కూడా ఉంది.  ఇలా గవర్నర్ పిలుపుకు ప్రభుత్వ అధికారులు కాదని సమాధానం చెప్పడం వెనుక పెద్ద రీజనే ఉంది.  గవర్నర్ ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరు.  ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటారే తప్ప తనకున్న విశేష అధికారాలను ప్రదర్శించరు. 
 
అలా చేస్తే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే లెక్క.  ఒకవేళ సీఎస్, హెల్త్ సెక్రెటరీ గవర్నర్ సమీక్షకు హాజరై ఉంటే ఇవే సంకేతాలు జనంలోకి వెళ్లేవి.  అందుకే కేసీఆర్ వారిని సమీక్షకు వెళ్లనివ్వకుండా ఆపారని అంటున్నారు.  పైగా గవర్నర్ భాజపా ప్రతినిధి.  అసలే కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ అంటే అస్సలు పడదు.  గతంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చూసిన ఆయన విద్యుత్ బిల్లుల విషయంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు.  అలాంటిది బీజేపీ వ్యక్తి అయిన గవర్నర్ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటామంటే అస్సలు ఒప్పుకోరు కదా.  అందుకే అధికారులను సమీక్షకు వెళ్లకుండా అడ్డుకుని ఉండవచ్చు. 
 
మరోవైపు గవర్నర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ను ప్రయోగించాలనే డిమాండ్ కూడా ప్రతిపక్షాల నుండి వచ్చింది.  కానీ అది అసాధ్యమైన విషయం.  సెక్షన్ 8 అనేది రాష్ట్ర విభజన సమయంలో క్రియేట్ అయిన సెక్షన్.  శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ప్రజల స్వచ్చను, ఆస్తులను కాపాడటానికి మాత్రమే వాడాలి.  కరోనా విపత్తు లా అండ ఆర్డర్ సమస్య కాదు కాబట్టి గవర్నర్ సెక్షన్ 8 ప్రయోగించలేరు.  అసలు ప్రతిపక్షాలు గవర్నర్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ మీద పైచేయి సాధించాలని అనుకోవడం అప్రజాస్వామికమైన అంశం.  అది రాజ్యాంగ విరుద్ధం కూడ.  
 
ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా సీఎం కేసీఆర్ పూర్తి బాద్యుడిగా, ప్రజలకు జవాబుదారుగా ఉంటారు.  కానీ అలా గవర్నర్ ఉండలేరు, ఉండరు కూడ.  అలాంటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యాన్ని ప్రతిపక్షాలు కోరడం, గవర్నర్ కూడా అందుకు ముందుకొచ్చే ప్రయత్నం చేయడం సమంజసం కాదు.  అదే జరిగితే అది కేసీఆర్ పాలనను తొలగించి బీజేపీ పాలనను ఆహ్వానించడమే అవుతుంది.  ఇలాంటి పరిణామాన్ని కేసీఆర్ మాత్రమే కాదు ఏ ముఖ్యమంత్రీ అంగీకరించరు.  అందుకే కేసీఆర్ అడ్డుతగిలారు.  ఈ సంగతి బీజేపీ అధినాయకత్వానికి అర్థమయ్యే ఉంటుంది.  మరి వారు కేసీఆర్ తీరు పట్ల ఎలా స్పందనను బట్టి వారికి రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో బేరీజు వేయవచ్చు.