పవన్ ‘ఆలస్యం’.. జగన్ ‘అలసత్వం’.. వీటిలో ఏది ప్రమాదకరం ?

Ys Jagan's negligence is more dangerous than Pawan's late response
అమరావతి రైతుల ఉద్యమం జూలై 4వ తేదీకి 200 రోజులకు చేరుకుంది.  ఈ సంధర్భంగా ఒక్క అధికార పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాయి.  ముఖ్య నేతలందరూ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాజధాని నుండి అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేశారు.  టీడీపీ, బీజేపీ, వామపక్షాలు అన్నీ రైతుల స్టాండ్ తీసుకున్నాయి.  200 రోజుల ఉద్యమం అనే సందర్భాన్ని విశేషంగా ఎలివేట్ చేశాయి.  దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలు అమరావతికి మద్దతు పలికారు.  కానీ మరొక ప్రధాన పార్టీ జనసేన మాత్రం జూలై 4న స్పందించలేదు. 
 
 
పవన్ సహా జనసేన నేతలు ఎవ్వరూ ఆమరావతి గురించి మాట్లాడలేదు.  ఈ పరిణామం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందనే అనాలి.  మొదటి నుండి పవన్ అమరావతికి పూర్తి మద్దతుగా ఉంటూ వస్తున్నారు.  చంద్రబాబు హయాంలో కూడా భూముల సేకరణలో రైతులను ఇబ్బందిపెట్టవద్దని పదే పదే పవన్ కోరారు.  ఏది ఏమైనా రాజధానిని ఆమరావతి నుండి తరలించలేరని, అందుకు హామీ తనదని అన్నారు.  అందుకే పవన్ మౌనం ప్రజలకు చిత్రంగా తోచింది.  ఒకానొక దశలో పవన్ తన వైఖరిని మార్చుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. 
 
కానీ వాటన్నింటికీ ఫులుస్టాప్ పెడుతూ పవన్ రాజధాని విషయమై స్పందించారు.  తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకొంటామని ప్రభుత్వం అనడం సరికాదన్న పవన్ 200 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలకు తమ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు.  రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికే కానీ పార్టీకి కాదని, 29,000 మంది రైతుల త్యాగాన్ని వృధా కానివ్వమని, భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు.  మొత్తానికి తాను రాజధాని రైతుల తరపునే ఉంటానని పవన్ స్పష్టం చేశారు.  కానీ కొందరు అధికార పార్టీ మద్దతుదారులు పవన్ మద్దతును పక్కనబెట్టి ఆలస్యంగా స్పందిస్తారా అంటూ విమర్శిస్తున్నారు. 
 
 
అసలు పవన్ కు ఆమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిందనే సంగతి ఈరోజే తెలిసిందని వెటకారం చేశారు.  అంతేకానీ ఆలస్యంగా అయినా పవన్ రైతుల పక్షాన నిలబడ్డారనే సంగతి గ్రహించలేకపోతున్నారు.  అయినా పవన్ 200 రోజుల మైలురాయి రోజుకు రెండు రోజుల ఆలస్యంగా స్పందించినంత మాత్రాన ఉద్యమం చేస్తున్న రైతులకు జరిగిన నష్టం ఏమీ లేదు.  కానీ సీఎం వైఎస్ జగన్ అలసత్వం మాత్రం భూములిచ్చిన రైతుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టింది.  అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో నిర్మాణంలో ఉన్న రాజధానిని పక్కనపడేసి చిత్రమైన మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు జగన్. 
 
దీంతో రైతులు పొరాటాని దిగారు.  వైకాపా ఎంతసేపటికీ చంద్రబాబు అమరావతి పేరుతో అవినీతికి పాల్పడ్డారని అంటున్నారే కానీ ఏనాడూ ఆ అవినీతి తాలూకు ఆధారాలను బయటపెట్టలేదు.  సరే నిజంగానే టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని అనుకున్నా భూములిచ్చిన 29,000 మంది రైతులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారు, సెకరించిన భూముల్లో కట్టిన భారీ కట్టడాలను ఏం చేస్తారు అనేది ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు.  ఎంతసేపూ అభివృద్ది ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండానే ఈ మూడు క్యాపిటల్స్ అంటున్నారు తప్ప పూర్తిస్థాయి రాజధాని అనేది లేకుండా మూడు ముక్కల రాజధానులతో అభివృద్ది ఎలా సాధ్యమో ఇంతవరకు ఒక చెప్పలేదు.  
 
 
ఇది అలసత్వం కాకపోతే మరేమిటి.  ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా గత ప్రభుత్వం కోసం భూములను వదులుకున్న రైతులను గౌరవించటం, ఆదుకోవడం వైఎస్ జగన్ భాద్యత.  అది మరచిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ ఆలస్యంగా స్పదించాడు, అతను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటున్నారు.  మరి అధికారం చేతిలో లేని పవన్ అభిప్రాయ వ్యక్తీకరణలోని ఆలస్యం కంటే అధికారం చేతిలో ఉండి కూడా భూములిచ్చిన రైతులను పట్టించుకోని వైఎస్ జగన్ యొక్క అలసత్వం ప్రమాదకరమని వైకాపా శ్రేణులు ఎప్పుడు గ్రహిస్తాయో.