నిమ్మగడ్డ మీద వైసీపీ నిఘా..  కోర్టు దెబ్బలకు ఆయింట్‌మెంట్ పూసుకోవడానికే 

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఎలాగైనా పైచేయి సాధించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.  స్థానిక ఎన్నికలను రద్దు చేయడంతో రమేశ్ కుమార్ చంద్రబాబు ఆదేశాలకి అనుగుణంగా పనిచేస్తున్నారనే నెపం మోపి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుండి తొలగించి ఆయన స్థానంలో రిటైర్డ్ జడ్జిని నియమించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం.  కానీ నిమ్మగడ్డ న్యాయపోరాటానికి దిగడంతో జగన్ సర్కారుకు వరుస ఎదురుదెబ్బలు తగలడం మొదలైంది.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక ఆర్డినెన్సులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని, ఈసీ పదవిలో రమేశ్ కుమార్ కొనసాగవచ్చని తీర్పు ఇచ్చింది. 
 
 
దీంతో షాక్ తిన్న సర్కార్ హైకోర్టు తీర్పు మీద స్టే కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లి రెండుసార్లు నిరాశకు గురైంది.  ఇలా పదే పదే ఒకే కేసులో అత్యున్నత న్యాయస్థానాల ద్వారా మొట్టికాయల తినడంతో తప్పు ప్రభుత్వం వైపే ఉందనే అభిప్రాయం జనాల్లో బాగా ఎక్కువైంది.  వాటికి తోడు వైసీపీ లీడర్లు చాలామంది నిమ్మగడ్డ విషయంలో తగ్గేది లేదన్నట్టు మాట్లాడే సరికి ప్రభుత్వం నిజంగానే నిమ్మగడ్డ మీద కక్ష కట్టిందా అనే అనుమానాలు మొదలయ్యాయిం నిమ్మగడ్డ ఎక్కడా వైసీపీ లీడర్లు మాట్లాడినట్టు విపరీత ధోరణిలో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, కోర్టుల్లో ఆయనకు అనుకూలంగానే తీర్పులు రావడంతో ప్రజల్లో నిమ్మగడ్డపై సానుభూతి కూడా ఏర్పడింది. 
 
 
ఇదే వైసీపీకి తలనొప్పిగా పరిణమించింది.  నెమ్మదిగా కేసు నిమ్మగడ్డకు అనుకూలంగా తిరుగుతుండటంతో గెలుపు మీద కూడా ప్రభుత్వానికి నమ్మకం సన్నగిల్లింది.  ఒకవేళ ఓడిపోతే ప్రజల్లో ప్రతిష్ట దెబ్బతింటుంది.  అందుకే ప్రజాక్షేత్రంలో సానుభూతి కూడగట్టుకోవాలని భావించింది.  అవకాశం దొరికితే నిమ్మగడ్డ మీద రాజకీయ ఆరోపణలు చేసి, ఆయన టీడీపీ మనిషని ప్రూవ్ చేయాలనుకున్నాయి.  ఆ ఆలోచన ఫలితం నిమ్మగడ్డ మీద నిఘా ఏర్పాటు.  నిమ్మగడ్డ కదలికలను పూర్తిస్థాయిలో మానిటర్ చేయడం స్టార్ట్ చేశారు. 
 
 
ఆ నిఘాలో భాగంగానే ఆయన పార్క్ హయాత్ వెళ్లారని, భాజాపా నేతలు కామినేని, సుజనా చౌదరిలను కలిశారని కనిపెట్టి, హోటల్ నుండి సీసీటీవీ ఫుటేజీలను సేకరించి అన్ని మీడియా సంస్థలకు అందించింది.  నిమ్మగడ్డ సీక్రెట్ మీటింగ్ ద్వారా భాజపాలో ఉన్న చంద్రబాబు అనుచరులను కలిశారని, ఆ మీటింగులో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారని, వారంతా కలిసి ప్రభుత్వం మీద కుట్రకు పథకం రచిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు.  ఈ ఉదంతంతో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు రాజకీయ నాయకులతో పనేమిటని కొందరు, అయినా నిమ్మగడ్డ పదవిలో లేరు కదా.. అలాంటప్పుడు ఆయన ఎవర్ని కలిస్తే ఏముంది, ప్రభుత్వానికి అంత భాధ, భయం ఏమిటని రెండు వేరువేరు వాదనలు వినబడ్డాయి.  
 
 
సో.. ఇక్కడ వైసీపీ ప్లాన్ నూటికి నూరు శాతం వర్కవుట్ కాలేదు.  అంతేకాదు ఈ వీడియో ఫుటేజీలను ప్రభుత్వం తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టి రమేశ్ కుమార్ వ్యవహారశైలి మొదటి నుండి ఇలానే అనుమానాస్పదంగా ఉందని, ఆయన రాజకీయ శక్తులతో కుమ్మక్కై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అనుమానంతోనే ఆయన్ను తొలగించామని చెప్పుకోవచ్చు.  కానీ అది కేవలం అనుమానం మాత్రమే కాబట్టి, నిమ్మగడ్డ సుజనా చౌదరి, కామినేనిలను కలవడంలో నేరమేమీ చేయలేదు కాబట్టి ఆ వీడియో ఫుటేజీలను కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.  మొత్తంగా కొన్ని రోజుల క్రితం మనం చర్చించుకున్నట్టు నిమ్మగడ్డ ఎపిసోడ్లో హైడ్రామా ఇంకా మిగిలే ఉంది.