నిమ్మగడ్డ భుజంపై ఉన్న తుపాకీ ఎవరిది? 

Nimmagadda Ramesh

కొందరి నిర్ణయాలు స్వయంకృతాపరాధాలుగా మారుతాయి. “తెలివిగల కుందేలు వెళ్ళి మురికి కాలవలో పడింది.” “అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడింది.” ఇలాంటి సామెతలు నిజం చేస్తూ కొందరు అప్పుడప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. కుందేలు మురికి కాల్వలో పడ్డా, బల్లి కుడితి తొట్లో పడినా ఒక్కోసారి అది స్వయంకృతం అవచ్చు. కొన్ని సార్లు మాత్రం కొందరి ప్రభావం వల్ల తప్పులు జరుగుతాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొదటి నుండి కొందరి ప్రభావం వల్లనే తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సుదీర్ఘ కాలం ఐఏఎస్ అధికారిగా వివిధ పదవులు నిర్వహించిన విశేష అనుభవం కలిగిన నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత లభించిన గౌరవ పదవిలో చివరి యేడాది చిక్కుల్లో పడ్డారు. ఎవరి వత్తిళ్ళవల్లో లేక ఎవరి ప్రభావంతో ఆయన ఈ చర్యలకు పాల్పడ్డారో ఆయనే ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ప్రజలకు కొంత స్పష్టత ఉంది. కాకపోతే అది అంగీకారం కాకపోవచ్చు.

నిమ్మగడ్డ మొదటి నుండి ప్రేరేపిత లేదా ప్రభావిత నిర్ణయాలే తీసుకుంటున్నారు. 2018లో జరగవలసిన ఎన్నికలను అప్పటి ప్రభుత్వం జరపకపోయినా ఆయన మౌనంగా ఉన్నారు. తనది రాజ్యాంగ పదవి అని, తాను రాష్ట్రప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండనవసరం లేదు అని అప్పుడు అనుకోలేదు. గత ప్రభుత్వంలో ఆయనకు కనిపించని రాజ్యాంగ హోదా ఈ ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఇది పూర్తిగా తప్పుపట్టే ఆలోచన.

ఎన్నికల వాయిదాలో కూడా ఆయన తప్పుదారిలోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం, అధికార పక్షాన్ని వివరణ కోరామకపోవడం ఏకపక్ష నిర్ణయమే. పైగా ఎవరో ప్రభావితం చేసినట్టుగా లేక ప్రేరేపించినట్టుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కనీసంగా రాష్ట్ర ఆరోగ్య శాఖను కానీ, పంచాయితీ రాజ్ శాఖను కానీ పురపాలక శాఖను కానీ కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కానీ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ను కానీ సంప్రదించకుండా ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటించేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో పూర్తిగా నిమగంమై ఉంది. రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. శాంతిభద్రతల సమస్య ఉంటే వారు చర్యలు తీసుకోవాలి. వారి వైఫల్యం ఉంటే ఎన్నికల కమిషనర్ తనవంతుగా సంప్రదింపులు చేసి ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటించి ఉండాల్సింది. అటువంటి చర్యలేం ఆయన తీసుకోలేదు.

ఆతర్వాత నిమ్మగడ్డ రాసినట్టు చెపుతున్న లేఖ కూడా ప్రేరేపితం అనే అనుకోవాలి. ఇంత అనుభవం ఉన్న అధికారి ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పూర్తిగా ప్రేరేపితమే. ఒక అధికారి రాతపూర్వకంగా ఒక రాజకీయ నాయకుడిలా ఆరోపణలు చేయరు.

ఇప్పుడు కోర్టులో వివాదం పూర్తయిన తర్వాత కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆఘమేఘాలపై ఆయన బాధ్యతలు స్వీకరించడం కూడా ప్రేరేపితమనే అనుకోవాలి.. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు పంతానికి పోయి తనది పైచేయి అని నిమ్మగడ్డ చెప్పుకోవలసిన అవసరం లేదు. పైగా కోర్టు తనను ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన విషయం నిమ్మగడ్డకు తెలియకపోలేదు లేదా అర్ధం కాకపోలేదు. ఎవరో ప్రేరేపించినట్టుగా లేదా ఎవరో వత్తిడి చేసినట్టుగా, ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసమో లేక ఎవరిదో పైచేయి అనిపించడం కోసం నిమ్మగడ్డ తొందరపడి బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది.

అలాగే ఇన్నేళ్ళ సర్వీసులో కోర్టు తీర్పులు ఎలా ఉంటాయి, తీర్పు వెలువడిన తర్వాత ఎప్పుడు ఎలా వాటిని అమలు చేసే క్రమం మొదలవుతుంది అనే విషయాలు ఏవీ తెలియకుండానే నిమ్మగడ్డ పనిచేశారా అనే అనుమానం కలగక మానదు. కోర్టు నిర్ణయం కాపీలు కూడా చేతికి అందకముందే, కోర్టు నిర్దేశించిన మేరకు వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఇంకా స్పందించక ముందే తనకు తానుగా బాధ్యతలు స్వీకరించడం ఎవరి ప్రయోజనాలు కాపాడడానికో ప్రజలు ఉహించగలరు. తీరా ప్రభుత్వం తన తొందరపాటును ఎత్తి చూపిస్తుంటే ప్రభుత్వంపై మరోసారి ఆరోపణలకు దిగటం చూస్తుంటే నిమ్మగడ్డ ఎవరికోసమో ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిమ్మగడ్డ భుజంపై ఎవరిదో తుపాకీ ఎక్కుపెట్టబడి ఉందని ప్రజలకు అర్ధం అవుతూనే ఉంది.

నిమ్మగడ్డలాంటి వారి చర్యల వల్ల ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న సామాజిక వర్గం అభాసుపాలవుతోందని ఇప్పటికైనా వారు గ్రహిస్తే మంచిది. అమరావతి కోసం మొహమ్మద్ షరీఫ్ భుజంపై తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కాల్పులు జరిపిన చేతులే ఇప్పుడు నిమ్మగడ్డ భుజంపై తుపాకీ పెట్టాయని, ఇలాంటి కుట్రలు అర్ధం చేసుకోవడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముందు ఉంటారని తెలుసుకోకపోతే 2024లో ఇప్పుడు మిగిలి ఉన్న సీట్లు కూడా గెలవడం కష్టం.