‘నేను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రాను..’ అంటూ అసెంబ్లీ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ‘ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై’ ఇచ్చిన వివరణ తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. ‘ఆయన ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ విచారణ పరిధిలోకి వస్తారు. సీనియర్ శాసన సభ్యులు, స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన తర్వాత, స్పీకర్ ఆదేశాల మేరకు ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతోంది.
విచారణకు ఖచ్చితంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ హాజరు కావాల్సిందే..’ అంటున్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. ‘నేను ఆ పరిధిలోకి రాను.. అని నిమ్మగడ్డ అనడం సబబు కాదు.. ఖచ్చితంగా వస్తారు, వచ్చి తీరతారు.. లేకపోతే, తదనంతర పరిణామాల్ని ఆయన తప్పక ఎదుర్కోవాల్సి వుంటుంది..’ అని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. నిజానికి, సభా హక్కుల ఉల్లంఘన కింద ఎస్ఈసీ మీద నోటీసులు జారీ చేస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని గతంలో మహారాష్ట్రకి చెందిన ఓ కేసు స్పష్టం చేసింది. ఆ ఘటనలో ఎన్నికల అధికారపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని గతంలోనే అధికార వైసీపీ నేతలు ఉటంకించారు. పలువురు రాజకీయ విశ్లేషకులూ, న్యాయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే, పంచాయితీ ఎన్నికల వేళ తనను అధికార పార్టీ నేతలు దుర్భాషలాడిన వైనాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై గతంలోనే గవర్నర్‌కి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యామ్నాయ అవకాశాల్ని అన్వేషిస్తున్నారట. మరోపక్క, గవర్నర్‌కీ తనకూ మధ్య నడిచిన లేఖల వ్యవహారం లీకవడాన్ని తీవ్రంగా పరిగణించిన నిమ్మగడ్డ, ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ వేరే ధర్మాసనానికి ఆ పిటిషన్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద, అధికార పార్టీకీ – నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కీ మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుకి సంబంధించి నిమ్మగడ్డ స్వయంగా నిప్పుతో చెలగాటమాడుతున్నారనే అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి.