జనం ఆదరణ, విమర్శ తగ్గని నేత జగన్ 

YS Jagan
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయింది. ఈ యేడాది కాలంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. అయినా ప్రజాదరణలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. మరోవైపు ఆయనపై వ్యతిరేకతలో కూడా ఏమాత్రం తరుగు కనిపించలేదు. ఈ యేడాదిగా జగన్ తన పనులు తాను చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్ధులు తమ వంతు విమర్శలు చేస్తూనే ఉన్నారు. మీడియా, కోర్టులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తునే ఉన్నాయి. అయినా ప్రజాదరణలో ఏమాత్రం వెనకడుగు పడినట్టు కనిపించలేదు. 
 
జగన్ పరిపాలనకు కొత్త. ఇంతకు ముందు కనీసం మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు ఎలా కదులుతాయో కనీస అవగాహన లేదు. పైగా ప్రత్యర్థిగా ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు పాలనలో దిట్ట అని పేరున్న వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు, విభజిత రాష్ట్రానికి నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. గతంలో మరో పదేళ్ళు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేసిన వ్యక్తి. ఇలాంటి అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతను ప్రత్యర్థిగా పెట్టుకుని ఏమాత్రం అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి ఒక యేడాది పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం అంటే గొప్ప విజయంగానే పరిగణించాలి. 
 
అనుభవం ఉండడమే కాదు వ్యవస్థలను ఎలా తనకు అనుకూలంగా మలచుకోవాలో తెలిసిన చంద్రబాబు, మీడియా మద్దతు కూడా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి యేడాదిపాటు పరిపాలన చేయడం గొప్ప విజయమే. 
 
తన పార్టీలో అనుభవజ్ఞులు, వ్యూహకర్తలు లేరు. కనీసం యనమల రామకృషుడు వంటి నేతకు ధీటుగా సమాధానం చెప్పగలిగిన నాయకుడు లేడు. ఒకవేళ సమాధానం చెప్పినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే మీడియా తనవైపు లేదు. పైగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు, మీడియా, పారిశ్రామిక వేత్తలు, ఇలా అందరూ వైరి పక్షంలో కత్తులు దూస్తూ ప్రతిక్షణం చీల్చి చెండాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగా నిలబడి ఒక వైపు ప్రత్యర్థులను ఎదుర్కొంటూ, మరోవైపు తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేస్తూ ఒక యేడాది పూర్తిచేయడం చాలా గొప్ప విజయంగానే పరిగణించాల్సి ఉంది. 
 
ప్రత్యర్థులను పెద్దగా పట్టించుకోకుండా తనపై విశ్వాసం ఉంచిన ప్రజలకు చేరువగా ఉండేందుకు ఈ యేడాదిపాటు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తూనే ఉన్నారు. ఆ కృషిలో ఆయన విజయం సాధించారు. యేడాదిలో పరిపాలనలో, సంక్షేమంలో ఎన్నో మార్పులు చేర్పులు తెచ్చారు. అయినా ప్రత్యర్థులనుండి తప్ప ప్రజలనుండి వ్యతిరేకత రాకపోవడం గొప్ప విజయమే. 
 
వృద్ధులు, వికలాంగుల కష్టాలను తీర్చుతూ పెన్షన్ వారి గుమ్మంలోకి తేవడం జగన్మోహన్ రెడ్డి మొదటి విజయం. అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, పంచాయితీ కార్యాలయం దగ్గర పడిగాపులు లేకుండా నెల నెలా పెన్షన్ ఇంటికి రావడం వృద్ధుల మనసు దోచుకుంది. ఆపైన రేషన్ కూడా నేరుగా ఇంటికే చేరడంతో ప్రజల్లో జగన్ నాయకత్వం పట్ల, పనితీరు పట్ల మరింత విశ్వాసం పెరిగింది. 
 
పెన్షన్ వచ్చింది. రేషన్ వచ్చింది. రైతు భరోసా వచ్చింది. వాహన మిత్ర వచ్చింది. అమ్మఒడి వచ్చింది. ఫీజు రీయింబర్సు జరిగిపోయింది. వీటికి తోడు ప్రభుత్వ పాలన సచివాలయాల పేరుతో మరింత చేరువయింది. ఏదో ఒక సంతకం కోసం మండల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా సంతకం గ్రామ సచివాలయం నుండే వస్తోంది. ఇల్లు కదలాల్సిన అవసరం లేదు. గ్రామం దాటి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చేతిలో నిండుగా డబ్బు ఉంటోంది. సామాన్య పౌరుడికి ఇంతకంటే కావాల్సిందేముంది? ఇక రేపో మాపో ఇళ్ళ స్థలాలు వస్తాయి. ఆ తర్వాత ఇళ్ళు కూడా కట్టించి ఇస్తాడు. ఇది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పై ఉన్న భరోసా. 
 
ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా, మీడియా ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా, న్యాయస్థానాలు కూడా ఎన్నిసార్లు తప్పు పట్టినా ప్రజల్లో కొంచెం కూడా అభిమానం తగ్గకపోవడానికి కారణాలు ఇవే. ఈ విజయాలతోనే 2019లో ప్రజలిచ్చిన భారీ విజయాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి కొన్ని పధకాల అమలు విషయంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఈ పాటికే వచ్చి ఉండాల్సింది. అయితే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఆయనకు చేదోడుగా వచ్చి ప్రజాభిమానం తగ్గకుండా, తన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా రక్షించాయి. 
 
పరిపాలనా సంస్కరణలు జగన్మోహన్ రెడ్డికి అన్ని ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుతున్నాయి. ప్రజల్లో ఉండే ఈ అనుకూల వాతావరణాన్ని మరో నాలుగేళ్ళు కాపాడుకోగలిగితే 2024 ఎన్నికలు నల్లేరుపై నడక అవుతాయనడంలో అతిశయం లేదు. ప్రజాదరణ ముందు ప్రత్యర్థులు, మీడియా కూడా 2019లో జగ్మోహన్ రెడ్డి విజయాన్ని నిలువరించలేకపోయాయి. ఆ ప్రజాదరణ చెక్కు చెదరనంత కాలం ప్రత్యర్ధులు ఆయన పీఠాన్ని కదిలించలేరు.