చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రాకూడదు 

Chandra Babu Naidu is struggling as an Opposition leader
ప్రజెంట్ టీడీపీ పరిస్థితి ఏం బాగోలేదు.  అధినాయకత్వం నుండి కింది స్థాయి కేడర్ వరకు అందరూ నిరుత్సాహంలో ఉన్నారు.  గెలుపోటములు చంద్రబాబుకు కొత్తేమీ కాదు.  దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు.  పెద్ద పెద్ద సంక్షోభాల నుండి పార్టీని గట్టెక్కించిన ఘనత ఆయనది.  కానీ ఈసారి వైఎస్ జగన్ రూపంలో ఎదురైన ఓటమి కొంచెం పెద్దదే.  దాన్ని కూడా తట్టుకుని నిలబడే మనోధైర్యం బాబుగారికి ఉంది.  కానీ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, నెలకొన్న పరిస్థితులు పార్టీని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. 
 
ఓటమి పాలైన టాప్ లీగ్ నేతల్లో చాలామంది  ఓటమి నుండి ఇంకా కోలుకోలేదట.  పైగా అధికార పక్షం మీద ఫైట్ చేయడానికి వారికి ఇప్పటివరకు సరైన కారణాలేవీ దొరకలేదు.  రాజధాని భూముకు, విశాఖ గ్యాస్ లీక్ లాంటి సమస్యలు ఉత్పన్నమైనా అధికార పార్టీ వాటిని సమర్థవంతంగానే ఎదుర్కొంటోంది.  ఇక సంక్షేమ కార్యక్రమాల పేరిట రైతులకి నగదు బదిలీ చేయడం, ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి, 10 లక్షలు, 10,000 పరిహారం ప్రకటించడంతో జనంలో కొంత ప్రతిష్ట సంపాదించారు. 
 
వీటన్నిటికీ తోడు లాక్ డౌన్ ప్రకటించడంతో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్లోనే చిక్కుకుపోయారు.  నేతలతో వీడియో కాన్ఫరెన్సుల్లో మాట్లాడటం తప్ప డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు.  కీలక నేతలకు కూడా జనం మధ్యలోకి వచ్చి మాట్లాడే వీలు లేకపోయింది.  వీటన్నింటికీ తోడు లోకల్ లీడర్లకు, శ్రేణులకు పలానా అంశం మీద పని చేయండి అంటూ దిశానిర్దేశం కరువైంది.  పెద్ద లీడర్లలో ఇదివరకున్న ఉత్సాహం లోపించడంతో క్రీయాశీలక కార్యాచరణలు జరగడంలేదు. వీరందరినీ తిరిగి యాక్టివ్ స్టేట్లోకి తీసుకురావడం బాబుగారికి పెద్ద సవాల్ అయిపోయింది.  
 
ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలనే తపనలో బాబుగారు డాక్టర్ సుధాకర్ ఇష్యూ లాంటి చిన్న చిన్న విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రస్తావిస్తుండటం లాంటివి చూస్తున్న కేడర్ అధినేత స్థాయికి ఇలా చిన్నా చితకా విషయాలను పట్టుకుని ఏం ప్రయోజనం పెద్ద సమస్యలను చర్చకు తెస్తే పార్టీకి కొద్దో గొప్పో మైలేజ్ ఉంటుంది అంటూ తమలో తాము చర్చించుకుంటున్నారు.  వీటన్నిటి మధ్య ఎప్పుడూ పొత్తుల మీద ఏదో ఒక పార్టీని పక్కనబెట్టుకుని రాజకీయం నడిపే బాబుగారికి ప్రస్తుతం చెలిమి చేసే పార్టీలేవీ లేకపోయాయి.
 
మొత్తం మీద ప్రజెంట్ చంద్రబాబుగారికి పార్టీని ఒంటరిగా ముందుకు లాక్కెళ్లడం భారంగానే మారిందనుకోవాలి.  ఇంకొన్నాళ్లు ఈ మంద గమనంలోనే పార్టీ నడిస్తే ప్రజల్లో ఉనికిని కాపాడుకోవడం కూడా కష్టమైపోతుంది.  వచ్చే ఎన్నికల నాటికి చేరికలు కాదు కదా పిరాయింపులు ఎక్కువై టిక్కెట్ల కేటాయింపు కోసం అభ్యర్థులను వెతుక్కోవాల్సిన సంక్షోభంలోకి పార్టీ జారిపోయే ప్రమాదం ఉంది.