చంద్రబాబు ఏపీకి రావడానికి ఇంత రచ్చ జరగాలా ?

 

చంద్రబాబు ఏపీకి రావడానికి ఇంత రచ్చ జరగాలా ?

 
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు రావాలనుకుంటున్నారు.  లాక్ డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  రేపు హైదరాబాద్ నుండి విమానం ద్వారా విశాఖ చేరుకుని అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులని పరామర్శించి అనంతరం రోడ్డు మార్గం ద్వారా అమరావతికి చేరుకోవాలనేది బాబుగారి ప్లాన్.  అయితే ఈ అంశమై ఏపీ ప్రభుత్వానికి, బాబుకు మధ్యన రగడ మొదలైంది.  చంద్రబాబు తాను విశాఖ వెళ్తున్నానని తెలంగాణ డీజీపీకి, ఏపీ డీజీపీకి లేఖలు రాశారు. 
 
తెలంగాణ డీజీపీ నుండి వెంటనే అనుమతులు అందాయి.  అయితే ఏపీ డీజీపీ మాత్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదని, తాను ఏపీ వచ్చి గ్యాస్ లీక్ బాధితులను కలవడం అధికార పక్షానికి ఇష్టం లేదని ఆరోపణలు చేస్తున్నారు.  మార్చి 20 నుండి సీబీఎన్ హైదరాబాద్లోనే ఉండిపోవడం చేత ఏపీలో టీడీపీ శ్రేణిలు నిస్తేజంగా మిగిలిపోయాయి.  ఏ పనీ కార్యక్రమం సరిగా చేయలేకపోయారు.  తీరా ఇప్పుడు వచ్చే వీలున్నా తమ నాయకుడిని విశాఖకు రాకుండా అధికార పక్షం అడ్డుపడుతోందని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.  
 
ఇదిలా ఉంటే ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాత్రం అసలు చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాసి ఉంటే ఆధారాలు చూపాలని, ఆయన విశాఖ వస్తే తమకేమీ అభ్యంతరం లేదని భాజాపా నేత కన్నా లక్ష్మీనారాయణ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విశాఖలో పర్యటించారని, వారిని తాము అడ్డుకోలేదని, ఒకవేళ చంద్రబాబు ధరఖాస్తు చేసుకుని ఉంటే కూడా అడ్డుకోమని అన్నారు.  దీంతో ఇదంతా చూస్తున్న ప్రజలు చంద్రబాబు నాయుడు ఏపీకి రావడంలో ఇంత రచ్చ ఎందుకని అంటున్నారు.  
 
ఒకవేళ చంద్రబాబు అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకుని ఉంటే వైకాపా సర్కార్ ఆపుతోందా లేకపోతే సీబీఎన్ ధరఖాస్తు చేసుకోకుండానే చేసుకున్నట్టు చెబుతున్నారా.. వీటిలో ఏది నిజమైనా ఈ చిన్నపాటి అంశంలో ఇంత గొడవ దేనికి, ఇలాంటి విషయాలను కూడా రాజకీయం చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.