చంద్రబాబుకు ఒకటి ఉపశమనం! మరొకటి గట్టి షాక్!

చంద్రబాబు నాయుడు అయిదు ఏళ్ల కాలంలో సంభవించిన తప్పులు వెతికే పనిలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తలమునకలుగా వుంది. ఏమాత్రం సందుదొరినా బోను ఎక్కించాలనే ధోరణిలో పని చేస్తోంది. అందులో పోలవరం ప్రాజెక్టు ముఖ్యమైనది. ఎన్నికల మునుపే సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ చంద్రబాబు నాయుడుకు పోలవరం ప్రాజెక్టు ఎటిఎం లాగా వుందని వ్యాఖ్యానించిన సందర్భముంది. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే చెప్ప పనిలేదు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పోలవరం లో చోటు చేసుకున్న అవినీతిపై మంత్రి వర్గ ఉపసంఘం నియమించారు. తదుపరి నిపుణుల సంఘం విచారణ జరిపి నివేదిక ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు అక్రమ చెల్లింపులు జరిగాయని నిగ్గు తేల్చి కేంద్రానికి నివేదిక పంపారు. ఈలోపు ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు.ఫలితంగా ప్రధాన మంత్రి కార్యాలయం కేంద జల శక్తి శాఖను నివేదిక కోరింది. అయితే ఇంతకు ముందే చట్ట సభలో కేంద్ర మంత్రి ఒక సభ్యుని ప్రశ్నకు జవాబు ఇస్తూ చెల్లింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని చెప్పివున్న నేపథ్యంలో తుదకు ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇదే తరహా జవాబు కేంద్ర జల శక్తి శాఖ పంపింది. శనివారం ఈ వార్త ఢిల్లీ నుండి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు ఊరటే.

అయితే ఢిల్లీ నుండి ఈ వార్త వెలువడిన రోజునే చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ తగిలింది. ఢిల్లీ నుండే మరో వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు హయాంలో నిఘా అధిపతిగా వుండిన ఎబి వెంకటేశ్వర రావును జగన్ సర్కారు సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఎబి వెంకటేశ్వర రావు కేంద్ర ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని వాదించారు. తన సస్పెన్షన్ సమాచారాన్ని సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి పంప లేదనేది వెంకటేశ్వర రావు వాదన. ట్రిబ్యునల్ లో విచారణ పూర్తయి తీర్పు రిజర్వులో వున్న సమయంలో కేంద్రం నుండి పిడుగులాంటి వార్త శనివారం వచ్చింది. సివిల్ సర్వీసెస్ అధికారులపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలంటే కేంద ప్రభుత్వం అనుమతి తప్పని సరి. వెంకటేశ్వర రావు పై రాష్ట్ర ప్రభుత్వం మోపిన ఆరోపణలకు ఆధారాలు వున్నాయని కేంద్రం ఆమోదించి సకాలంలో చార్జి షీట్ దాఖలు చేయాలని కోరింది. ఈ పరిణామం ప్రత్యక్షంగా వెంకటేశ్వర రావుకు అశని పాతమైన పరోక్షంగా ఈ ఎపిసోడ్ అంతా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ వున్నందున స్థానిక ఎన్నికల పూర్వ రంగంలో ఒక విధంగా ఎదురు దెబ్బే.