కోర్టు తీర్పులను పట్టుకుని టీడీపీ చంకలు గుద్దుకోవడం అపాలి
నిన్న మే 23తో వైఎస్ జగన్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భాన్ని వైకాపా శ్రేణులు గొప్పగా చెప్పుకుంటుంటే ఓటమిని గుర్తు చేసుకోలేని టీడీపీ మరో దారి వెతుక్కుంది. అదే హైకోర్టులో నిన్న పలు విషయాల్లో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ అవడం. వాస్తవానికి అవేమీ పెద్ద విషయాలు కానప్పటికీ టీడీపీ, వారి అనుకూల మీడియా భూతద్దంలో చూపుతూ సంబరపడిపోతున్నారు.
దాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలివడితే అదేదో జగన్ సర్కార్ మీద పెద్ద విజయం సాధించినట్టు టీడీపీ ఫీలైపోతోంది. అంతేకాదు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసే విషయంలో ముందు ఇచ్చిన తీర్పును కాదని కొన్ని మార్పులతో మరో జీవో ఇష్యూ చేసింది సర్కార్. దాన్ని తీవ్రస్థాయిలో కోర్టు తప్పుబట్టింది. ఇది కొంచెం తీవ్రమైన విషయమే. సర్కార్ నిర్ణయాలను తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదంతం చెబుతోంది. అలాగే సీబీఐ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవన్నీ వార్తలే కానీ ప్రతిపక్షం సంబరాలు చేసుకోవాల్సిన విశేషాలు కాదు. అలాగే జగన్ సర్కార్ ఈ చిన్నా చితకా ఎదురుదెబ్బలతోనే ఇరుకున పడిపోయిందని, ప్రజల్లో వైకాపా ప్రతిష్ట దెబ్బతింటుందని అనుకొని టీడీపీ ఈ వార్తల్ని వైరల్ చేయాలని అనుకుంటే మాత్రం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే జగన్ ఏదో అరకొర సీట్లతో ముఖ్యమంత్రి కాలేదు. 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ స్థానాలతో చరిత్రను క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చారు. ఆ పేరు అంత సులభంగా డ్యామేజ్ కాదు. ఇలాంటి కోర్టు తీర్పులతో అసలే కాదు.
ఇలా కోర్టులో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం కొత్తేమీ కాదు, కోర్టు తీర్పుల విషయంలో పరాభవం చూసిన పార్టీల్లో వైకాపా మొదటిది కాదు. గతంలో అనేక ప్రభుత్వాలు పలు అంశాల్లో కోర్టు తీర్పులతో నిరాశ చెందిన సందర్భాలు అనేకం. టీడీపీకి కూడా గతంలో ఈ అనుభవం ఉంది. కాబట్టి ప్రభుత్వాల నిర్ణయాలపై కొందరు హైకోర్టులో వ్యాజ్యాలు వేయడం, వాటి విచారణలో ప్రభుత్వాలకు ప్రతికూల తీర్పులు రావడం, వాటిని సవాల్ చేస్తూ ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. కనుక టీడీపీ, వారి అనుకూల మీడియా కోర్టు తీర్పుల అంశాలను గట్టిగా పట్టుకుని అధికార పక్షాన్ని కుంగదీయాలనే వృథా ప్రయత్నం మానుకుంటే సమయమన్నా కలిసొస్తుంది.