కోవిడ్ 19 మహమ్మారి మానవాళిని కబళిస్తున్న వేళ నివారణ ఔషధం కనిపెట్టడం కోసం ప్రపంచ దేశాలనీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని దేశాలు ఔషధం కనిపెట్టే ప్రాసెస్లో పురోగతి సాధిస్తున్నామని చెబుతున్నా ఇప్పటికీ అధికారికంగా డ్రగ్ ప్రిపేర్ కాలేదు. దీంతో అంతర్జాతీయంగా ఫార్మా రంగం మీద అంతులేని ఒత్తిడి నెలకొంది. ప్రపంచ దేశాల ప్రజలు సైతం ఎవరో ఒకరు త్వరగా ఔషధం కనిపెడితే బాగుంటుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో భారత ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ ఔషధాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది.
మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేశామన్న గ్లెన్ మార్క్ సంస్థ ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసి ఫవిపిరవిర్ ఔషధం కనిపెట్టామని, ఇది కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందామని, ప్రభుత్వ సహకారంతో సాధ్యమైనంత త్వరగా ఔషదాన్ని మార్కెట్లోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది.
ఔషదాన్ని వాడే పద్దతి:
ఫాబిఫ్లూ అని నామకరణం చేయబడిన ఈ డ్రగ్ కరోనాపై మొట్టమొదటి ఓరల్ డ్రగ్. ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించిన సంస్థ
కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు ఆ తర్వాత వరుసగా 14 రోజులపాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు వాడాలని చెబుతున్నారు. కరోనా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న రోగులపై ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుందంటున్న గ్లెన్ మార్క్ సంస్థ ఔషదాన్ని మధుమేహ, హృద్రోగ సమస్యలు ఉన్నవారు కూడా వాడొచ్చని తెలిపింది. ఈ ఔషధం ఆశించిన ఫలితాల్ని గనుక ఇస్తే ప్రపంచానికి భారత ఫార్మా రంగం మర్చిపోలేని గొప్ప మేలు చేసినట్టే.