ఎవ్వరినీ వదలనని సవాల్ చేస్తూ స్టేషన్లో లొంగిపోయిన కూన
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై తహసీల్దారును ఫోన్ చేసి బెదిరించినందుకు, లంచం ఇవ్వాలని ప్రయత్నించినందుకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఇంటికి వెళ్లే సరికే కూన కనబడకుండా పోయారు. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాలు ఆయన కోసం గాలింపు చేపట్టాయి. కానీ ఉన్నట్టుండి కూన రవికుమార్ మరో ముగ్గురు అనుచరులతో కలిసి పొందూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
లొంగిపోయిన కూన వాదన మరోలా ఉంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న వాయిస్ రికార్డ్ తనది కాదని, టాంపరింగ్ చేసి కావాలనే తనును ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేనా ఈ వ్యవహారం వెనుక స్పీకర్ తమ్మినేని ఉన్నారని, అవినీతి అధికారులకు ఆయన కొమ్ము కాస్తూ తనపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని, ఎవరు ఏం చేసినా అవినీతి అధికారులను ప్రశ్నించడం తాను మాననని, తనకంటూ ఒకరోజు వస్తుందని, అప్పుడు ఎవ్వరినీ వదిలేది లేదని అన్నారు.
కొన్ని రోజుల క్రితం రామసాగరం చెరువులో మట్టి అక్రమ తవ్వకాల విషయంలో కూన సోదరుడికి చెందిన జెసీబీలు, టిప్పర్లను తహసీల్దార్ సీజ్ చేశారు. ఈ విషయంలో కలుగజేసుకున్న కూన రవికుమార్ నేరుగా తహసీల్దార్ కు ఫోన్ చేసి ఎంత లంచం కావాలో చెప్పు, వాహనాలు వదలకపోతే లంచం డిమాండ్ చేశావని కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ తరహా గొడవలు కూనకు కొత్తేమీ కాదు. గతంలో ఒకసారి ఇలాగే అధికారులను దుర్భాషలాడి పరారయ్యారు.. ఇంకొసారి బెదిరింపుల కేసులో స్టేషనుకు వెళ్లి బెయిల్ మీద తిరిగొచ్చారు.
గతంలో అయితే పార్టీ, నాయకుల అండ ఉండేది కాబట్టి కేసుల నుండి సులభంగానే బయటపడుతూ వచ్చారు కూన. కానీ ఈసారి అధికారం లేదు, పార్టీలోని పెద్ద తలలే స్వీయ రక్షణలో తలమునకలై ఉన్నారు. మరి ఈ విపత్కర సమయంలో రవికుమార్ కేసు నుండి ఎలా బయటపడతారో చూడాలి.