ఈ హత్యా నేరాలన్నీ ఎవరి మీద మోపాలి మోడీజీ 

PM Modi
 
కరోనా కట్టడి పేరుతో కేంద్రం విధించిన లాక్ డౌన్ వలన అధికంగా నష్టపోయిన వర్గం ఏదంటే వలస కార్మిక వర్గం.  వీరి గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేంద్రం ఉన్నపళంగా లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది వలస కూలీలు పరాయి ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు.  తినడానికి తిండి లేక, చేతిలో డబ్బుల్లేక, ఉండటానికి చోటు లేక ల, స్వస్థలాలకు చేరుకోవడానికి వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఇందుకు కారణం ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే.  
 
ప్రతియేటా సుమారు 90 లక్షల మంది వలస కూలీలు సొంత ప్రాంతాల నుండి మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు జీవనోపాధి కోసం వలసలు వెళుతుంటారు.  వీరి అధికారిక లెక్కలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి.  అయినా వారి గురించి ఆలోచించకుండా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం పరిస్థితి విషమించే వరకు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.  నాయకుల నిర్లక్ష్యంతో తిండి, ఆదాయం, వసతి కోల్పోయిన కూలీలు నెలరోజులు నరకం అనుభవించి ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయి వందల, వేల కిలోమీటర్లను లెక్కచేయకుండా కాలినడక ఇళ్లకు బయలుదేరారు. 
 
చేతిలో చిల్లిగవ్వ లేకుండా హైవేలు ఎక్కిన వీరిపై స్థానిక పోలీసులు ప్రతాపం చూపారు.  దీంతో గత్యంతరం లేక రైలు పట్టాలు పట్టుకుని ప్రయాణం సాగించారు.  ఈ క్రమంలో ఔరంగాబాద్లో రాత్రి పట్టాలపై నిద్రించిన కూలీలపై నుండి గూడ్స్ రైలు వెళ్లడంతో 16మంది కూలీలు మరణించారు.  మధ్యప్రదేశ్ సమీపంలో అయితే లారీ బోల్తాపడి ఐదుగురు ప్రాణాలు విడిచారు.  ఇక నడక ప్రయాణంలో తిండి లేక అలసిపోయి రోడ్ల మీదే ఆగిన గుండెలు కొన్నైతే ఆదాయం లేక బీదరికంతో ఆత్మహత్యలు చేసుకున్నవారు కొందరు.  ఈ మరణాల్లో బయటికొచ్చినవి కొన్నే అయితే బాహ్యప్రపంచానికి తెలీనవి చాలా ఉన్నాయి. 
 
ఈ మరణాలన్నీ ప్రమాదవశాత్తు సంభవించినవి కావు ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వలన జరిగినవే.  విదేశాల్లో ఉన్న భారతీయుల్ని ప్రత్యేక విమానాలు వేసి మరీ ఇండియాకు రప్పిస్తున్న మోడీ సర్కార్ దేశంలో ఉన్న ఈ వలస కూలీలను పట్టించుకోకపోవడానికి కారణం వారంతా నోరు తెరిచి ప్రశ్నించే శక్తి లేనివారనే చిన్నచూపే.  ఈ చిన్నచూపు పర్యవసానం పదుల సంఖ్యలో కూలీల మరణాలు, లక్షల మంది కన్నీటి కష్టాలు.  ఇంత దారుణం జరిగాక కంటితుడుపుగా శ్రామిక్ రైల్ పేరుతో 47 రోజుల తర్వాత  రైళ్లు ప్రారంభించిన కేంద్రం వారందరినీ ఉద్దరించేసినట్టు ఊదరకొడుతోంది కానీ మరణాలకు ఎవరు భాద్యత వహిస్తారు, ఎవరి మీద ఈ హత్యానేరాలన్నీ మోపాలి, ఎవరిని శిక్షించాలి అనే విషయమై మాత్రం నోరు మెదపడం లేదు.