ఆంధ్రాలో అధికారులు బుర్రలు వాడుతున్నారా?

గత 11 నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే అధికార యంత్రాగం అలోచించి పనిచేస్తోందా, లేదా? ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందా లేక ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేస్తోందా అనే అనుమానం కలగక మానదు. ఈ 11 నెలల్లో ఒకే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టునుండి నాలుగు సార్లు మొట్టికాయలు వేయించుకున్నదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో ఆలోచించాల్సి వస్తోంది. 
 
అధికారులతో పాటు కొందరు ప్రభుత్వ పెద్దలు కూడా బుర్రలు పక్కన పడేసి అత్యుత్సాహంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలో ప్రభుత్వ భవనాలకు అధికారపార్టీ రంగులు వేసేశారు. ప్రభుత్వ పగ్గాలు ఇవ్వడం అంటే ప్రభుత్వం మొత్తాన్ని తమ పార్టీ జేబు సంస్థగా మార్చుకోవచ్చని బహుశా ఈ అధికారులు, కొందరు పెద్దలు ఆలోచన చేసి ఉంటారు. ఐదేళ్ళ పాటు అధికారంలో ఉండే పార్టీకి అన్ని హక్కులు ఉండవని మొత్తం వ్యవస్థ స్వరూపాన్ని మార్చే అధికారం ఉండదని వీరికి బోధపడినట్టు లేదు. 
 
అన్న క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, వాటర్ ట్యాంకులకు గత తెలుగుదేశం ప్రభుత్వం ముదురు పసుపు రంగులు వేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తాము తమ పార్టీ రంగులు అన్ని ప్రభుత్వ భవనాలకు వేసుకోవచ్చని ఈ నేతలు భావించి ఉంటారు. వారికి కొందరు అధికారులు వత్తాసు పలికి ఉంటారు. బహుశా అందుకే ఇన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేయాల్సి వచ్చింది. 
 
ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్కెట్లో రంగులు మారవు. తెలుగుదేశం అధికారంలో ఉంటే మార్కెట్లో పచ్చరంగులు ఎక్కువ అమ్ముడుపోవు. లేదా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పచ్చ రంగును కోర్టులు నిషేధించలేవు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు కూడా. ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మార్కెట్లో నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులు రద్దు కావు లేదా ఎక్కువగా అమ్ముడుపోవు. వాటిని ఎవరూ ఏమీ చేయలేరు. 
 
ఈ రంగులు ఏ భవనాలకు అయినా వేసుకోవచ్చు. అయితే వచ్చిన చిక్కేమిటంటే పార్టీకి ఒకటికంటే ఎక్కువ రంగులు ఉంటే ఆ రంగులన్నీ వాడాలంటే ఇబ్బందులు తప్పవు. ఒకవేళ పార్టీకి ఉండే రంగులన్నీ వాడుకున్నా అవి పార్టీని స్ఫురింపజేసే పద్దతిలో ఉండకూడదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మూడు రంగులు ప్రభుత్వ భవనాలకు వాడుకోవచ్చు. కానీ ఆ వాడకం పార్టీ జెండా నమూనా (పాటర్న్)ను పోలి ఉండకూడదు.  ఈ చిన్న లాజిక్ మిస్సయిన ఆంధ్ర ప్రదేశ్ అధికారులు కోర్టువేసే మొట్టికాయలు తింటూనే ఉన్నారు. 
 
తాజాగా కోర్టు మూడోసారి మొట్టికాయలు వేసినప్పుడు ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు తోడు మరో రంగు చేర్చి సమర్ధించుకోవచ్చని అధికారులు భావించారు. ఆ మేరకు ముదురు గోధుమ రంగు కూడా జత చేస్తూ గత నెలలో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తాజా ఉత్తర్వులపై కూడా మరోసారి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, ఉత్తర్వులను కొట్టివేసింది. అసలు ఉన్న మూడు రంగుల నమూనా (Pattern) మార్చకుండా దానికి ఎన్ని రంగులు జతచేసినా కోర్టులు అంగీకరించవని అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తట్టినట్టు లేదు. 
 
కోర్టులు రంగులకు వ్యతిరేకం కాదు, రంగు వేసిన నమూనాకు మాత్రమే వ్యతిరేకం. ఆ నమూనా మార్చక పోవడం మరోమారు ప్రభుత్వం కోర్టులో అభాసుపాలు కావాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి, మెదడుకు పని చెప్పి ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల నమూనా మార్చితే మరోసారి మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాదు. నమూనా (Pattern) మార్చి ఒక మోడల్ భవనం ఫోటో కోర్టుకు అప్పగిస్తే కాస్త ఈ మొట్టికాయలనుండి ఊరట కలగవచ్చు. 
 
అటువైపు ప్రతిపక్షం ప్రతి  అంశాన్ని వివాదం చేయాలనీ చూస్తున్నప్పుడు, ప్రతి విషయాన్నీ కోర్టు ముందుకు తీసుకెళుతున్నప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిదే. అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు దాటిన తర్వాత కూడా మెదడుకు పనిచెప్పకపోతే కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంటుంది.