అవసరమైనప్పుడల్లా ఆర్జీవీ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారా

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఒకప్పుడు ఆహా..ఓహో అనేవారు.  కానీ ఇప్పుడు వామ్మో.. వాయ్యో అనే స్థితికి దిగజారిపోయాయి ఆయన స్టాండర్డ్స్.  నాకు ఇష్టమొచ్చిన పనే చేస్తా, ఎవ్వరినీ పట్టించుకోను అనే వర్మ జనం తనను పట్టించుకోకపోతే మట్టుకు బ్రతకలేరు.  ప్రజల అప్రమత్తత కోసం నానా పాట్లు పడుతుంటారు.  ఒకప్పుడు ఆయన కొత్తదనం నిండిన ఆయన బుర్ర ప్రజెంట్ బోర్ కొచ్చిన దుస్థితిలో ఉంది.  అందుకే నిత్యం సెలబ్రిటీల మీద ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తూ వార్తల్లో నానుతూ తనను, తన సినిమాలను మార్కెట్ చేసుకుంటూ ఉంటారు.  వర్మలోని ఈ వెర్రి పోకడలను చూసే కొన్ని రాజకీయ శక్తులు తమ ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించడానికి వాడుకుంటున్నారు. 
 
గతంలో పలు కీలక సమయాల్లో వర్మ యొక్క వికృత సేవలను భేషుగ్గా వాడుకున్న కొందరు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తున్న సమయమది.  ఇండస్ట్రీ నుండి ఆయనకు ఎలాంటి మద్దతు లభించలేదు కానీ రాళ్లు మాత్రం పడ్డాయి.  శ్రీరెడ్డి లాంటి వారిచేత పవన్ ను బహిరంగంగా తిట్టించారు.  అప్పట్లో ఈ ఉదంతం పెను దుమారాన్నే సృష్టించింది.  అసలు పవన్ ను బూతులు తిట్టమని శ్రీరెడ్డికి సలహా చెప్పింది తానేనని వర్మ స్వయంగా ఒప్పుకున్నారు.  ఇక అది మొదలు పవన్ మీద గురి ఉన్న ప్రతి ఒక్కరూ అదే బాట పట్టారు.  షెడ్డుకి పోయే స్థితిలో ఉన్న కొందరు సినిమా వ్యక్తుల చేత రాజకీయ పార్టీల చెప్పు చేతల్లో నడిచే పలు టీవీ ఛానెళ్లు డిబేట్లు పెట్టి మరీ ఆయన్ను విమర్శించాయి.   
 
నైతికతను మరచి పవన్ వ్యక్తిగత జీవితంలోకి దూరి ఆయన వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.  కానీ పవన్ ఆ తాటాకు చప్పుళ్లకు తొణక లేదు.  సంబంధం లేకుండా పవన్ మీద పడి టీవీ ఛానెళ్లలో ఏడ్చిన వ్యక్తుల వెనుక టీడీపీ, వైసీపీ పార్టీలు ఉన్నాయని అప్పట్లో జనసేన శ్రేణులు, అభిమానులు ఆరోపించారు.  అధికారంలో ఉన్న టీడీపీ మీదే ఎక్కువ మంది ఆరోపణలు చేశారు.  జనం సైతం మీడియా ఓవరాక్షన్ చూసి ఒక వ్యక్తిని ఇంతలా కార్నర్ చేయడం కరెక్ట్ కాదని చీవాట్లు పెట్టారు.  చివరికి ఎన్నికల నాటికి అదే స్ట్రాటజీ టీడీపీ మీద ప్రయోగించబడింది.  ఆ స్ట్రాటజీలో పావు ఆర్జీవీనే.  ఏకంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి పాత్ర ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చేశారు వర్మ. 
 
అప్పట్లో అధికారంలో ఉండటం వలన టీడీపీ తమ పరువు తీయడానికి వైసీపీయే వర్మ చేత ఈ చిత్రం చేయించిందని ఆ చిత్ర విడుదలను అడ్డుకుంది కానీ ఎన్నికల్లో ఓడిపోయాక మాత్రం ఆ చిత్రం భేషుగ్గా విడుదలైంది.  ఆ తర్వాత బాబును మరింత డీగ్రేడ్ చేస్తూ, జగన్ ను ఎలివేట్ చేస్తూ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమా చేసి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారనే పేరు మూటగట్టుకున్నారు వర్మ.  ఆ సినిమా కూడా సరిగ్గా వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే వచ్చింది.  అలా అధికారంలో ఎవరుంటే వారికి వర్మ పనిచేస్తారని, వారి ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఉపయోగపడుతుంటారని ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడిపోయింది.  
 
ఈమధ్య ఓ శృంగార తారలతో సినిమాలు చేసుకుంటూ టైమ్ పాస్ చేసుకుంటున్న వర్మ మళ్లీ పవన్ మీదకు దృష్టి మళ్లించారు.  పవర్ స్టార్ అనే టైటిల్ పెట్టి పవన్ వ్యక్తిగత జీవితం మీద సినిమా తీసే పని మొదలు పెట్టారు.  ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ట్వీట్ చేసిన ఆయన ఆ తర్వాత కొద్దిసేపటికే తన సినిమాలో పవర్ స్టార్ ఇతనే అంటూ పవన్ పోలికలున్న వ్యక్తిని రివీల్ చేశారు.  దీంతో మరోసారి పవన్ మీద నైతిక  దాడికి కుట్రలు మొదలయ్యాయని స్పష్టమైంది.  జనసేన కార్యకర్తలైతే ఇది అధికార పార్టీ పనేనని మండిపడుతున్నారు.  గత నాలుగైదు రోజుల నుండి కాపు రిజర్వేషన్లు, కాపులకు నిధుల కేటాయింపులు వంటి అంశాల్లో అధికార వైకాపాకు, జనసేనకు మధ్యన వాగ్వాదం జరుగుతోంది.  
 
పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అధికార పార్టీ నేతలందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టుకుని పవన్ చంద్రబాబు మనిషని, కులం పేరుతో రాజకీయం చేస్తున్నారని, ముద్రగడను హింసించినప్పుడు బాబును ఎందుకు ప్రశ్నించలేదని సంబంధం లేని ఏవేవో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.  ఇలాంటి తరుణంలోనే ఆర్జీవీ పవన్ మీద సినిమా అంటూ ముందుకు రావడంతో ఈ సినిమా పవన్ మీద జరుగుతున్న కుట్రని, అధికార పార్టీయే వర్మ చేత ఈ పని చేయిస్తోందని, గతంలో కూడా వర్మ టీడీపీ, వైకాపాలకు తొత్తుగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారని, ఇదంతా కాపు ఇష్యూ మీద నుండి తమ దృష్టి మరల్చడానికేనని ఆరోపిస్తున్నారు.  బుర్రలో గుజ్జంతా ఇంకిపోయి శృంగార తారలతో సినిమాలు చేస్తూ అది కూడా క్రియేటివిటీనే, అవి కూడా సినిమాలేనని వాదించే వర్మకు ఏవో ప్రయోజనాల కోసం రాజకీయ శక్తుల పంచన చేరి వేరొకరి వ్యక్తిత్వాలను దెబ్బతీసేలా సినిమాలు తీయడం సబబే అనిపించడంలో వింతేమీ లేదని అనుకుంటున్నారు.