అయ్యో.. ఇలా అయితే ఎలా పవన్ ?

జనసేనాని పవన్ కళ్యాణ్… ఈ పేరు వింటే లక్షల మందికి ఎక్కడా లేని ఉత్తేజం వస్తోందనేది కాదనలేం. కానీ గత ఎన్నికల ఫలితాలు పవన్ పరువును తీసేసాయనేది సగటు మనిషి కూడా చెప్పే మాట. అయితే ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఓటమికి భయపడకుండా ప్రజా పోరాటం సాగిస్తానంటూ ఆత్మ విశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. కాకపోతే పవన్ ఎక్కడో ట్రాక్ తప్పుతున్నాడనేది నిజం. మధ్య మధ్యలో జగన్ ప్రభుత్వ లోపాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నా.. రాజధాని మార్పు, ఇంగ్లీష్ మీడియం లాంటి కొన్ని జనం మెచ్చిన నిర్ణయాలను పవన్ వ్యతిరేకించడం, దాంతో ప్రజల్లో పవన్ పట్ల ఉన్న ఆ కొంచెం విశ్వాసం కూడా ఎదో ఒక అనాలోచిన ప్రకటనతో పోగొట్టుకుని మళ్ళీ మొదటికే వచ్చేస్తున్నాడు. దీనికి తోడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి పార్ట్ టైం పొలిటీషియన్ అనే తన బిరుదును నిజం చేసుకునట్టు అయింది.

నిజానికి పవన్ కళ్యాణ్ గతంలో ‘చచ్చినా సినిమాల జోలికి వెళ్ళనని’ శపథం చేశాడు, పైగా ‘ఈ జీవితం ప్రజా సేవకే అంకితం’ అన్నాడు, చివరికీ దానికి భిన్నంగా మళ్ళీ ముఖాన్ని రంగువేసుకోని తనది నిలకడలేమి తత్త్వం అని తానే స్వయంగా సగర్వంగా ప్రజలకు చాటి చెప్పుకున్నట్లు అయింది. సరే పవన్ దృష్టి కోణంలోనే చూద్దాం, పవన్ చెప్పిన వివరణ.. ‘నాకు తెలిసింది. సినిమా ఒక్కటే, కుటుంబ పోషణకి, అలాగే పార్టీని నడపడానికి డబ్బులు అవసరం, అందుకే సినిమాలు చేస్తున్నాను’ అంటూ పవన్ ఇచ్చిన సంజాయిషీ ఏ మాత్రం సంతృపి పరిచే విధంగా లేదు. ఏకంగా జనసేన కార్యకర్తలలోనే ఈ నిర్ణయం పట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక.. పవన్ తన సినిమా ప్రయాణం గురించి మళ్ళీ ఆలోచించుకోవాల్సింది.

ఒక్కటి మాత్రం చాల స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయాలు సినిమాలు అంటూ రెండు పడవల మీద పవన్ చేస్తోన్న ప్రయాణం అసలు బాగాలేదు, గమ్యం చేరేలా కనబడటం లేదు. రానున్న రెండు నెలలో రెండు చిత్రాల షూటింగ్స్ లో పవన్ నిమగ్నమవ్వాల్సి ఉంది. అలాగే మరో మూడు సినిమాలను కూడా అంగీకరించబోతున్నాడు. ఇక రాజకీయాల పై పవన్ తన దృష్టిని ఎలా కేంద్రీకరించగలడు ? టీడీపీ లేవనెత్తిన అంశాలకు సంబంధించే పవన్ బాబు కూడా సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేస్తూ అదే పోరాటం అనుకుంటే ఎలా ? అసలు పగలు రాజకీయాలు.. రాత్రుళ్ళు షూటింగ్ అన్నట్లు వ్యవహారం సాగిస్తే ప్రజల నమ్మకం గెలుచుకున్నేది ఎప్పుడు ? ఏమైనా.. ప్చ్.. ఇలా అయితే ఎలా పవన్ ?