రోజూ ఈ టీ తాగితే క్యాన్సర్, గుండె జబ్బులు దూరం.. తాజా పరిశోధనలో సంచలన ఫలితాలు..!

మన దేశంలో చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు. కొంత మంది రోజుకు ఒకటి కంటే ఎక్కువ టీ లు తాగుతుంటారు. దీని వలన కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇదిలా ఉంటే టీ కేవలం అలసటను పోగొట్టే పానీయమే కాదు, ఆరోగ్య రక్షకుడిగా కూడా పేరు తెచ్చుకుంటోంది. అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి రకాల టీలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గించడమే కాకుండా, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, ఆర్థరైటిస్, అలాగే మెదడు వ్యాధుల నుండి కూడా రక్షణ కల్పిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

టీ ఆకులలో లభించే పాలీఫెనాల్స్, ముఖ్యంగా EGCG (Epigallocatechin gallate) అనే యాంటీ ఆక్సిడెంట్ మూలకం, శరీరంలో మంటలను తగ్గిస్తుంది. కణాలను రక్షించడమే కాకుండా, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీని వలన శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.

తాజా అధ్యయనాలు చూపుతున్నట్లుగా రోజూ 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి రకాలపై టీ సానుకూల ప్రభావం చూపుతుందని నిర్ధారణైంది. అయితే చాలా వేడి టీ తాగడం శరీరానికి హానికరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గ్రీన్ టీ ప్రత్యేకంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ మంచి సహాయకుడు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, టీ తాగడం వల్ల మెదడు కూడా బలపడుతుంది. పార్కిన్సన్స్ వంటి న్యూరో సంబంధిత వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో టీ ఉపయోగకరమని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు వయస్సు పెరుగుదలను మందగించడంలో సహాయపడతాయని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే, టీని సరైన రీతిలో, సమతుల్యంగా తాగడం చాలా ముఖ్యం. ఎక్కువగా లేదా ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి హానికరం అవుతుంది. అలాగే ఎక్కువ చక్కెర కలిపితే ఆరోగ్య ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి పరిమిత మోతాదులో, సక్రమ సమయంలో టీ తాగితే అది కేవలం ఉదయం అలసటను పోగొట్టడమే కాకుండా, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. టీపై ప్రపంచవ్యాప్తంగా మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు లభించిన ఫలితాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి టీ మన జీవితాన్ని ఆరోగ్యవంతంగా, చురుకుగా మార్చగలదని. అందుకే నిపుణులు “రోజూ ఒక కప్పు టీ ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిదే” అని అభిప్రాయపడుతున్నారు.