ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశంలోని పలువురు కీలక నేతల మీద ప్రభుత్వం దృష్టి పెట్టగా నిన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ అరెస్ట్ మీద ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది. ఇది జగన్ యొక్క కక్షపూరిత కుట్రని నిరసనలు చేస్తోంది. ఇంతలోనే పోలీసులు టీడీపీలోని మరొక ముఖ్య, సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం సంచలనానికి దారితీసింది.
జెసీని, ఆయన కుమారుడిని హైదరాబాద్లోని నివాసంలో అదుపులోకి తీసుకుని అనంతపురం తరలిస్తున్నారు. అనంతపురం రవాణా అధికారులు ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ చర్యతో టీడీపీ శ్రేణుల్లో మరింత కలవరం మొదలైంది. 154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్వోసీలు సృష్టించారనే అభియోగంతో వీరిద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వాహనాలను బీఎస్ 3 నుండి బీఎస్ 4కు మార్చడం, ఇన్స్యూరెన్సులు చెల్లించకుండానే చెల్లించినట్టు నకిలీ పత్రాలు సృష్టించడం వంటి అభియోగాలు కూడా వీరి మీదున్నాయి.
అయితే టీడీపీ వాళ్ళు మాత్రం అసలు బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్టర్ చేయడం కుదరని పని అని, ఇది కేవలం కక్షపూరిత చర్యని వాదిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా జేసీ వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా జగన్ ఏడాది పాలనపై స్పందిస్తూ జగన్ తాను చెప్పిందే జరగాలనుకునే వ్యక్తని, అతను రాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే ఇలా జేసీ, ఆయన కుమారుడు అరెస్ట్ కావడం కలకలం రేపింది.