ఏపీలో కరెంట్ దోపిడీ.. నిర్మలా సీతారామన్ మాటల్ని కొట్టిపారేయలేం 

నిర్మలా సీతారామన్
వైఎస్ జగన్ పాలనలో ప్రజలు కరెంట్ కష్టాలను ఎదుర్కుంటున్నారనేది చాలా మంది చేస్తున్న ఆరోపణ.  గత రెండు నెలల్లో వచ్చిన కరెంట్ బిల్లులు చూస్తే అదే నిజమనిపిస్తోంది.  ప్రభుత్వ సొంత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు యూనిట్ విద్యుత్తును రూ. 3.25 లకు ఇస్తుండగా టీడీపీ ప్రభుత్వం మాత్రం యూనిట్ విద్యుత్తును రూ.4.83 నుండి 4.84కు, సొలార్ విద్యుత్తును రూ.4.50 నుండి 6.80 కు కొనుగోలు చేసిందని, ఇతర రాష్ట్రాలు మెగావాట్ విద్యుత్తును రూ.4.64 కోట్ల లోపే ఉత్పత్తి చేస్తుంటే మన రాష్ట్రం మాత్రం రూ.7 కోట్లు ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చిందో చెప్పాలని జగన్ లెక్కలు అగడగడం, పాత కారెంట్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో కరెంట్ ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశపడ్డారు. 
 
 
కానీ రివర్స్ లో కరెంట్ చార్జీల మోత మరింత ఎక్కువైంది.  వందల్లో బిల్లులు వచ్చే ఇళ్లకు కూడా వేలల్లో బిల్లులు రావడంతో వినియోగదారులు షాక్ తిన్నారు.  ఇదేమిటని ప్రశ్నిస్తే అంతా సరిగానే ఉందంటున్నారు తప్ప సామాన్యులకు అర్థమయ్యేలా వివరణ మాత్రం ఇవ్వలేదు ప్రభుత్వం.  తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏపీలో ప్రభుత్వం వసూలు చేస్తున్న కరెంట్ ధరల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.  కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శుక్రవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ ర్యాలీలో ఢిల్లీ నుంచి మాట్లాడిన సీతారామన్ ఏపీ కరెంట్ ధరలు చూసి అవాక్కయ్యారు. 
 
కేంద్ర ప్రభుత్వం యూనిట్ కరెంటును రూ.2.70 కే సరఫరా చేస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం అదే యూనిట్ ను ప్రజలకు రూ.9 లకు విక్రయిస్తోందని అన్నారు.  ఈ ధరలతో పరిశ్రమలు ఎలా నడుస్తాయు, కొత్త పరిశ్రమలు ఈ ధరలు చూసి రాష్ట్రానికి రావడానికి భయపడతాయని అన్నారు.  డిస్కంలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి, వాటిని ఆదుకోవడానికి ఆర్థిక ప్యాకేజీలో 90 వేల కోట్లు కేటాయించాం, విద్యుత్ సంస్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలకు కేంద్రమే భరోసా ఇస్తుందని అన్నారు.  ఆమె మాటల్ని వింటే విద్యుత్ చార్జీలు తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. 
 
 
కానీ ఏపీ సర్కార్ మాత్రం ఆ దిశగా సంస్కరణలు చేపట్టే ఆలోచనలోనే లేదు.  అసలే కోవిడ్ లాక్ డౌన్ కారణంగా కొత్త పెట్టుబడులు రావడమే గగనంగా మారింది.  వచ్చే ఆ కొన్ని పెట్టుబడులు కూడా ఏ రాష్ట్రంలో నిర్వాహణ వ్యయం తక్కువగా ఉంటే ఆ రాష్ట్రానికి పోతున్నాయి.  అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం కంపెనీలకు అనేక వెసులుబాట్లు కల్పిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.  కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటి వెసులుబాట్లు కల్పిస్తున్న దాఖలాలు లేవు.  పైగా 9 రూపాయల యూనిట్ ధర చూసి ఎవరైనా బెదరకుండా ఉండరు.  
 
కంపెనీల స్థాపన సమయంలో సర్కార్ ఎన్ని వెసులుబాట్లు కల్పించినా అధిక కరెంట్ ధరలతో పెను భారం మోయాల్సిందే.  అందుకే కొత్త పెట్టుబడులు ఏపీ వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదన్నది కఠిన వాస్తవం.  పైగా కేంద్ర హెచ్చరికలు పట్టించుకోకుండా జగన్ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను రద్దు చేశారు.  వీటి కారణంగా ప్రభుత్వాలు మారితే పెట్టుబడులకు, ఒప్పందాలకు ఏపీలో భద్రత ఉండదనే సంకేతాలు ఇప్పటికే బయటికి వెళ్లాయి.  ఇవన్నీ కలిసి పెట్టుబడులను అడ్డుకోవడమే కాకుండా ప్రగతిని కుంటుబడేలా చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.