మన భారత దేశంలో దేవాలయాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి మంగళవారం ఆదివారం రోజులలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రజల విశ్వాసం. అందువల్ల అనంతపురం జిల్లా వ్యాప్తంగా నెలమూలల నుండి ప్రజలు ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుంటారు.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి చాలా విశిష్టత ఉంది. క్రీ శకం 1509 -1530 కాలం మధ్యలో శ్రీ కృష్ణ దేవరాయలు గురువు శ్రీ వ్యాస రాజు ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఈ విగ్రహం ప్రతిష్టించిన కొంతకాలం తర్వాత ఆలయం విశిష్టత పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత 1980-90 మధ్య కాలం నుంచి ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజుకి పెరిగింది. ఈ క్రమంలోనే 2008 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఈ ఆలయాన్ని దర్శించి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలను ప్రతిష్టించారు.
ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పై భాగంలో సింహా ధ్వజం, నరసింహ అవతారం, విష్ణు తత్వం, శ్రీ కృష్ణదేవరాయ రాజవంశ ముద్రణ మనకు కనిపిస్తాయి. మధ్యలో స్వామి వారు మనకు శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు. అలాగే దిగువన పార్వతీదేవిని సూచించే చక్రం కూడా ఉంటుంది. ఈ చక్రం రాహు కేతు దోష నివారణను తొలగిస్తుంది.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి విగ్రహం పై ఏడు తలల పాము విగ్రహం కూడా ఉండటం ఇక్కడ విశేషం . కార్తీక మాసం, మాఘమాసం వంటి పవిత్ర మాసాలలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల రద్దీ రెట్టింపు ఉంటుంది. భక్తులు వారు కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటమే కాకుండా తొమ్మిది వారాలపాటు స్వామి వారిని దర్శించుకోవడం వల్ల కూడా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.