టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నగదు కానుక ఇస్తోంది. ఈ ఫైలుపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సంతకం చేశారు. బ్రహ్మోత్సవ బహుమానంపై తొలి సంతకం చేయడం ఆనందంగా ఉందని జవహర్ రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు 21 కోట్ల రూపాయలు చెల్లించనున్నది. శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850 ఇస్తోంది. టీటీడీ ఉద్యోగులతోపాటు అనుబంధ సంస్థల ఉద్యోగులకు కూడా టీటీడీ బ్రహ్మోత్సవ కానుకగా నగదు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ క్లారిటీకి రాలేదు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆనంద నిలయం బయట నిర్వహిస్తామని.. తిరుమాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవలు కొనసాగుతాయని 20 రోజుల క్రితం టీటీడీ ప్రకటించింది. కరోనా ప్రభావంతో పాటూ ఇతర కారణాలతో టీటీడీ బోర్డు పునరాలోచనలో పడింది. సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లుగానే స్వామివారి ఆలయంలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం మంచిదనే అభిప్రాయంలో ఉన్నారట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.