కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా కొత్తపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో కొలువై ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం డాం పూర్తిగా నిండినపుడు ఆడాం వెనుక జలాల వల్ల ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కేవలం కొన్ని నెలలు మాత్రమే ఈ ఆలయంలో సంగమేశ్వర స్వామి పూజలు అందుకుంటాడు. మిగిలిన కాలంలో ఆలయం మొత్తం కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వెనుక జలాలు తగ్గుముఖం పట్టడంతో ఈ ఆలయం బయటపడింది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆలయం మొత్తాన్ని శుభ్రం చేశారు.
కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ పురాతన ఆలయంలో ధర్మరాజు వేపదారు లింగం ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఎంతో మహిమగల ఈ ఆలయం బుధవారం భక్తులకు దర్శనమిచ్చింది. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే సంగమేశ్వరుడు దర్శన భాగ్యం లభిస్తుందడంతో ఈ దేవాలయ సందర్శనకు భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా లలితా దేవి సమేత సంగమేశ్వర స్వామి, వినాయకుడు తదితర దేవతా మూర్తులు చాలాకాలం తర్వాత ఆలయంలో తొలి పూజ అందుకున్నారు. సప్త నదుల సంగమ ప్రాంతంలో ఉండే ఈ సంగమేశ్వర దేవాలయం పూర్తిగా ఆరు నెలలు నీటిలో మునిగిపోయి ఉంటుంది. మిగిలిన ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ ధర్మాలయంలో సంగమేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. కోరిన కోరికలు నెరవేర్చే సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తారు. ఈ ఏడాది శ్రీశైలం నీటిమట్టం త్వరగా తగ్గడంతో సంగమేశ్వరుడి దర్శన భాగ్యం త్వరగా లభించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించడానికి దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు.