దేశంలో అమ్మవారి క్షేత్రాలలో బాగా ప్రసిద్ధి చెందినవాటిలో వైష్ణోదేవి దేవాలయం ఒకటి. ఇక్కడ అమ్మ దర్శనం అపూర భాగ్యం. అమ్మ ప్రసాదం మరింత విశేషం. అయితే కొవిడ్‌తో జమ్ముకశ్మీర్‌లోని ఈ దేవాలయానికి రావడం కష్టతరంగా మారింది. దీంతో భక్తులకు అమ్మప్రసాదం అందించాలనే తపనతో దేవాలయ బోర్డు చేసిన ఏర్పాటు గురించి తెలుసుకుందాం…
అమ్మలగన్న అమ్మ శ్రీ వైష్ణోదేవి ప్రసాదాలను భక్తుల వద్దకే నేరుగా పంపించే ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. వైష్ణోదేవి అమ్మవారి ప్రసాదాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ ద్వారా అందజేస్తున్నారు నిర్వాహకులు. దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
జమ్ము కశ్మీర్ లోని త్రికూట పర్వతాలపై కొలువైన వైష్ణోదేవి అమ్మవారిని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దర్శనాలకు ఇబ్బంది ఏర్పడటంతో ప్రసాదం హెం డెలివరీ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 72 గంటల్లోగా స్పీడ్ పోస్టు ద్వారా పూజా, ప్రసాదాలను అందించనున్నారు. వైష్ణోదేవి ఆలయ వెబ్ సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవాలని సూచించారు.