ఏకాదశి చాలా పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించటం వల్ల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును దర్శించడానికి ప్రజలందరూ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. ఇలా మహావిష్ణువును దర్శించి పూజించటం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. 2023 1 వ తేదీన ఏకాదశి ప్రారంభం అవుతుంది. 2023 సంవత్సరం పుత్రదా ఏకాదశి తో ప్రారంభం అవుతుంది. పుష్య మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ పుత్రదా ఏకాదశి 2023 జనవరి 01న రాత్రి 07.11 గంటలకు ప్రారంభమై.. జనవరి 02న రాత్రి 08.23 గంటలకు ముగుస్తుంది.
పుత్రదా ఏకాదశి కి చాలా విశిష్టత ఉంది. ఏకాదశి రోజున మహావిష్ణువును ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుత్రదా ఏకాదశి రోజున మహా విష్ణువును పూజించటం వల్ల ఏడాదిపాటు ఆ మహావిష్ణువుని పూజించిన పూజ ఫలితం దక్కుతుంది. అందువల్ల ఈ రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తలంటు స్నానం చేసి గంగాజలం తులసీదళాలతో అభిషేకం చేయాలి. ఏకాదశి రోజున ఎర్రటి పువ్వులు విష్ణువుకు సమర్పించాలి. అలాగే పంచామృతాలను నైవేద్యంగా పెట్టి లక్ష్మీ సమేత పూజించడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సిరిసంపదలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు.
ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించేవారు ఉపవాసం ఉండటం చాలా మంచిది. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని భావించేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసానికి ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్న స్త్రీ లేదా పురుషుడు చాలా నిష్టగా స్వీయ నియంత్రణ మరియు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ప్రారంభించడానికి, ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, విష్ణువును మనసారా ధ్యానించాలి. ఇక ఈ పుత్రదా ఏకాదశి వ్రతం పాటించే వారు నిర్జల వ్రతం చేయాలి. ఉపవాసం తరువాత మరుసటి రోజు ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణ వ్యక్తికి లేదా పేద వ్యక్తికి అన్నదానం చేసి దక్షిణగా దానం చేయాలి. ఇలా చేయటం వల్ల జీవితాంతం ఆనందాన్ని పొందుతారు. అంతే కాకుండా మరణం తరువాత కూడా మోక్షాన్ని పొందుతారు.