మహాశివరాత్రి రోజున ఈ నియమాలు పాటించి ఉపవాసం జాగరణ చేస్తే చాలు శివయ్య అనుగ్రహం మనపైనే?

పరమ పవిత్రమైన మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేసి శివుడి అనుగ్రహం పొందాలనుకుంటారు. అయితే శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేసే సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి చాలామందికి అవగాహన ఉండదు. శివపురాణంలో శివరాత్రి రోజు పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించారు. శివరాత్రి రోజున పరమశివుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. ఇందులో శివ పూజా, ఉపవాసం, జాగారం లాంటి పరిహారాలు ఉంటాయి. ముఖ్యంగా శివరాత్రి రోజున ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

శివరాత్రి పర్వదినాన బ్రహ్మ ముహూర్తంలో గంగాజలంతో స్నానం ఆచరించి ఆ తర్వాత శివ పూజ ప్రారంభిస్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుడికి పూజ చేయడమే కాకుండా నిష్టగా ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. శివరాత్రి రోజున చేసే ఉపవాసంలో శరీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం కారణంగా మనో శుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనసును శివుడికి అంకితం చేయటం . ముఖ్యంగా శివరాత్రి రోజున ఉపవాసం చేయాలనుకునేవారు ఉపవాసం పాటించే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు లాంటివి పదార్థాలు అస్సలు తినకూడదు. అలాగే మద్యపానం సేవించటం కూడా మహా పాపం.

అలాగే ఉపవాసం చేయాలనుకునేవారు ఎక్కువ సమయం నిద్రపోకూడదు. నిష్టగా ఉపవాస దీక్ష చేస్తూ శివనామ స్మరణ చేయటం వల్ల ఉపవాసం ఉన్న ప్రతిఫలం లభిస్తుంది. ఈ పర్వదినాన ఉపవాసం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభించడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉపవాస దీక్ష శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. అయితే ఉపవాసం ఉన్నాము కదా అని నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవద్దు. అలాగే శివరాత్రి రోజున ఉపవాస దీక్ష చేయడం వల్ల ఇంత పుణ్యం లభిస్తుందో జాగరణ చేయడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజు ఇష్టమొచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి జాగరణ అసలు చేయకూడదు.జాగరణ చేసే ప్రతి క్షణం శివుని ఆరాధన లోనే ఉండాలి. అప్పుడే జాగరణ చేసిన ప్రతిఫలం దక్కుతుంది.