కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. మార్చి 13న స్వామివారి బ్రహ్మరథోత్సవ వేడుకలు..!

మన భారత దేశంలో ఎన్నో విశిష్టత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని దేవాలయాలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. తిరుమల తిరుపతి లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాలలో కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి. అనంతపురం జిల్లా కదిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

అలాగే ఈ ఏడాది కూడా లక్ష్మినరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. “అంకురార్పణ” తో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యి “పుష్పయాగోత్సవం” వేడుకతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం.. ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం.

ఎంతో విశిష్టత కల్గిన ఆ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నాడు. అలాగే కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి కాటమరాయుడుగా, కదిరి నరసింహుడుగా పిలవబడుతున్నాడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే కదిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక శుక్రవారం స్వామివారి “కల్యాణోత్సవం” వేడుక నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించడానికి లక్షలాదిమంది భక్తులు హాజరుకానున్నారు. దీంతో కదిరిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న స్వామివారి బ్రహ్మరథోత్సవం (తేరు) వేడుకను నిర్వహించనున్నారు.