జేసీపై `మీసం తిప్పిన సీఐ` వైఎస్ఆర్ సీపీలోకి: హిందూపురం లోక్‌స‌భ స్థానం ఆయ‌నకేనా?

అనంత‌పురం జిల్లా క‌దిరి అర్బ‌న్ మాజీ సీఐ గోరంట్ల మాధ‌వ్ ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న హైద‌రాబాద్‌లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఆయ‌న చేతుల మీదుగా పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఇదివ‌ర‌కే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌నే ఉద్దేశంతోనే ఆయ‌న రాజీనామా చేశారు.

దీనికి అనుగుణంగా ఆయ‌న వైఎస్ఆర్ సీపీలో చేరారు. అనంత‌పురం జిల్లా పోలీసు అధికారుల సంఘానికి కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. స్థానిక లోక్‌స‌భ స‌భ్యుడు జేసీ దివాక‌ర్ రెడ్డిపై మీసం మెలేసి స‌వాలు విసిరిన ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చారు. స్వామి ప్ర‌బోధానంద ఆశ్ర‌మం వివాదంలో దివాక‌ర్ రెడ్డి జిల్లా పోలీసుల‌ను ఉద్దేశించి, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనికి నిర‌స‌నగా గోరంట్ల మాధ‌వ్ ఆయ‌న‌పై నిప్పులు చెరిగారు. తామేమీ జేసీ దివాక‌ర్ రెడ్డి పాలేర్లు కాద‌ని అన్నారు. తమ సొంత మైలేజీ కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తానంటూ హెచ్చరించారు. పోలీసుల‌ను దూషించ‌డం ఎంపీలు, ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని, ప్రతి విషయంలోనూ పోలీసుల మీద నోరుపారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు.

ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా అంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారాయ‌న‌. అనంత‌రం- త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. గోరంట్ల మాధ‌వ్‌కు హిందూపురం లోక్‌స‌భ స్థానం టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధ‌వ్ వెనుక‌బ‌డ్డ కురుబ కులానికి చెందిన వారు. అనంత‌పురం జిల్లాలో కురుబ కుల‌స్తులు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. ప్ర‌త్యేకించి హిందూపురం, మ‌డ‌క‌శిర‌, గోరంట్ల‌, క‌దిరి, పెనుకొండ‌, ధ‌ర్మ‌వ‌రం, పుట్ట‌ప‌ర్తి వంటి నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కురుబ‌లో అధికంగా నివ‌సిస్తున్నారు.

దీనికితోడు- హిందూపురం లోక్‌స‌భ స్థానంలో టీడీపీని ఢీ కొట్టే అభ్య‌ర్థి లేరని, దీన్ని దృష్టిలో ఉంచుకుని హిందూపురం లోక్‌స‌భ టికెట్ ఆయ‌న‌కు ఇవ్వ‌వ‌చ్చని అంటున్నారు. హిందూపురం లోక్‌స‌భ సీటును రెండుద‌ఫాలుగా టీడీపీ వ‌శం చేసుకుంది. టీడీపీ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఇక్క‌డ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.