సాధారణంగా ప్రజలు తమ కోరికలు, బాధలను నెరవేర్చాలని దేవుడిని ప్రార్థించేందుకు గుడులకు వెళ్తుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు గుడిలో దేవుడిని దర్శించుకుంటారు. మనకు ఎన్ని బాధలు ఉన్నా.. ఒక్కసారి దేవుడి ఆలయానికి వెళ్లి ఆయనను చూస్తే.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మనసు తేలిక అవుతుంది.కానీ ఈ ఆలయానికి కనుక వెళ్తే మనకు మానసిక ప్రశాంతత కలగడం ఏమో కానీ ప్రాణాలతో కూడా బయటకు రారని తెలుస్తోంది. ఈ ఆలయంలోకి వెళ్తే మరణం తప్పదని తెలిసి ఎవరు కూడా ఈ ఆలయంలోకి అడుగుపెట్టే సాహసం చేయరు. మరి అంతలా ఈ ఆలయంలో ఏముంది అనే విషయానికి వస్తే..
ఎంతో భయంకరమైనటువంటి ఈ ఆలయం దక్షిణ టర్కీలోని పాముక్కలే సమీపంలో ఉంది. ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. స్థానికులు ఈ గుడిని ‘ నరక ద్వారం’గా పిలుస్తారు. అయితే ఆ గుడిలోకి వెళ్లిన జంతువులు ఎందుకు మరణిస్తున్నాయనే దానిపై పరిశోధనలు చేశారు అయితే ఈ ఆలయంలోకి వెళ్ళిన వారు బయటకు రాకుండా లోపల మరణించడానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి వాయువులే కారణమని తెలుస్తుంది.
ఈ ఆలయం దిగువ భాగం నుంచి ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్ వాయువు వస్తుందని నిర్థారించారు. సైంటిస్టుల పరిశోధన ప్రకారం.. ఆలయం దిగువభాగాన పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉందని భావిస్తున్నారు. దీంతోనే గుడిలోపలకి వెళ్లిన జంతువులు, పక్షులు మరణిస్తున్నాయమని తేల్చారు. సాధారణంగా.. 10 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే.. 30 నిమిషాల్లో ఎవరైనా మత్తులోకి జారుకుంటారు.. తరువాత మరణిస్తారు. అయితే ఈ గుహలో ఈ విషవాయువు 91 శాతం వరకు ఉందని తేల్చారు. ఇలా అధిక మోతాదులో కార్బన్డయాక్సైడ్ ఉండటం వల్ల లోపలికి వెళ్ళిన వారికి ఆక్సిజన్ అందక మరణిస్తారని నిపుణులు వెల్లడించారు. దీంతో ఈ ఆలయంలోకి అడుగు పెట్టాలంటే ఎవరు కూడా సాహసం చేయలేకపోతున్నారని చెప్పాలి.