నమస్కారం.. అంటేనే సంస్కారాన్ని తెలియజేస్తుంది. అయితే సాధారణంగా నమస్కారాలు అనేక రకాలు. ముఖ్యంగా దేవాలయంలో నమస్కారం ఎలా పెట్టాలి అనే విషయం తెలుసుకుందాం…
భక్తులు రకరకాలు.. వీరిలో అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునేవాళ్లు కొందరైతే, పర్వదినాల్లో .. విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపించేవాళ్లు కొందరు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచుని ఆయన దర్శనం చేసుకుంటూ వుంటారు. అలా కాకుండా భక్తులు ఒక వైపున .. పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక పండితులు, పురాణాలు చెబుతున్నాయి. దేవాలయంలోని గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతి ఇస్తాడు. అదంతా స్పష్టంగా కనిపించాలంటే, భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమపక్కన నిలబడ వలసి ఉంటుంది.
ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో, అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక పక్కకి నిలబడే నమస్కరించ వలసి ఉంటుంది. ప్రధాన దైవానికి ఎదురుగా ఆయా దేవతా వాహనాలు, వారి దాసానుదాసుల ఉప ఆలయం ఉంటాయి. వీటిలో ప్రధానంగా హనుమంతుడు, గరుత్మంతుడు, నంది వంటి, సింహం, ఎలుక, విగ్రహాలు ఉంటాయి. వాటికి .. స్వామికి మధ్యలో నిలబడ రాదనేది మరో కారణంగా పెద్దలు చెబుతుంటారు. గుడిలో ఒక పద్ధతి ప్రకారం నిలబడి నమస్కారాలు చేసుకోవాలి. అది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. దేవుడికి అడ్డంగా వెనుక లేదా పక్కన వారికి దేవుడి మూలవిరాట్టు కనపడకుండా నిలబడం దోషం. అలా చేయకూడదు.