హిందూ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులపాటు ప్రజలందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు. ఈ పండుగ రోజున దేశ విదేశాలలో ఉన్న హిందూ ప్రజలందరూ తమ సొంత ఊర్లకు చేరుకుంటారు. ఇక మూడు రోజులపాటు జరుపుకొని ఈ పండుగలో మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవరోజు కనుమ పండుగ జరుపుకుంటారు. మొదటిరోజు అయిన భోగి పండుగ రోజున కొత్త ధాన్యాలతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే చిరుధాన్యాలతో రొట్టెలు చేసుకోవడం కూడా భోగి పండుగ ప్రత్యేకత.
ఇక భోగి పండుగ రోజున భోగి మంటలు చాలా ప్రత్యేకం. భోగి పండుగ రోజున తెల్లవారుజామునే ప్రజలందరూ భోగిమంటలు వేయడం చాలా కాలంగా ఆరవాయితీగా వస్తోంది. ఇంటి ముందు వేసే భోగి మంటలలో ఇంట్లో పాత వస్తువులను వేసి తగలబెడతారు. అంతేకాకుండా ఆవు పేడతో తయారు చేసిన పిడకలు కూడా ఈ భోగి మంటలలో వేస్తారు. అయితే ఇలా పిడకలు భోగిమంటలలో వేయటానికి శాస్త్రీయంగా కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దరిద్ర దేవతను తొలగిపోతుందని ప్రజల విశ్వాసం.
అయితే ఈ భోగి మంటలు వల్ల వెచ్చదనం మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా. ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. భోగి పండుగ రోజున ఆ పిడకలను భోగిమంటలలో వేస్తారు. అయితే ఇలా ఆవుపేడతో తయారు చేసిన పిడకలు భోగి మంటలలో వేయటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆవు పేడ ఆంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఇది మంటలలో వేసి కాల్చడం వల్ల వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులను నశింప చేస్తుంది. రావి, మామిడి, మేడి, వంటి ఔషధ చెట్ల బెరళ్లను కూడా భోగి మంటలలో వేస్తారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వీటిని భోగి మంటలలో వేసి కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది.