పూజ చేసేటప్పుడు ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే పుణ్యం లభిస్తుందో తెలుసా..?

మన హిందూ సంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో తమ ఇష్ట దైవానికి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ఉంటుందని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా ఒక్కో వారం ఒక్కో దేవుడికి ప్రాముఖ్యత ఉంటుంది అందువల్ల. వారం రోజులపాటు ఒక్కరోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటారు. అయితే ఇలా ఇంట్లో, దేవాలయాలలో పూజలు చేసే సమయంలో దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• వెంకటేశ్వర స్వామి: కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి తులసి మాల వేసి పూజలు చేయటం వల్ల స్వామి అనుగ్రహం పొందవచ్చు.

• ఆంజనేయుడు : మంగళవారం రోజున ఆంజనేయస్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాల నైవేద్యం సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభిస్తుంది.

• వినాయకుడు : ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి ప్రతి బుధవారం రోజున ఉండ్రాళ్ళు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల మాలతో వినాయకుడిని పూజించడం వల్ల మనకు జీవితంలో ఎదురయ్యే విజ్ఞాలు అన్ని తొలగిపోతాయి.

• లక్ష్మీదేవి : లక్ష్మీదేవిని సిరిసంపదలకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పువ్వులతో పూజ చేసి క్షీరాన్నము, తీపి పండ్లతో నైవేద్యంగా సమర్పించాలి.

• సూర్యుడు : ప్రజలందరికీ ప్రత్యక్షంగా కనిపించే దేవుడు ఆ సూర్యభగవానుడు. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన సూర్యభగవానుడుకి మెలకేత్తిన పెసలు, పాల అన్నం నైవేద్యంగా సమర్పించాలి.