శివాలయం.. దాదాపు ప్రతీ గ్రామంలో శివాలయాలు ఉంటాయి. కానీ ప్రపంచంలో అనేక ప్రాంతాలలో శివాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా ప్రత్యేకతలు ఉన్నవి. వాటిలో నాలుగు ముఖాలు కలిగిన శివలింగం ఉండటం ప్రత్యేకత. ఇలాంటి శివాలయం ఎక్కడుందో తెలుసుకుందాం…
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా లో నాచ్నా అనే గ్రామంలో చతుర్ముఖ లేదా చౌముఖనాథ్ అనే గుడి ఉంది…
ఈ గుడిలో దాదాపు ఐదు అడుగుల ఎత్తు ఉండే అరుదైన ముఖలింగం ఉంది. ఈ లింగం ఒకే శిల నుండి చెక్కబడటమే కాక, లింగానికి నాలుగు దిక్కులా నాలుగు ముఖాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఈ నాలుగు ముఖాల్లో మూడు ముఖాలు ప్రశాంత చిత్తంతో ధ్యానముద్ర లో ఉండగా, నాలుగవ ముఖం నోరు వెడల్పుగా తెరిచి, ముక్కుపుటాలు పైకి ఉంచి నాసికా రంధ్రాలను పెద్దవిగా చేసి, కాలభైరవుని వలే రౌద్రమైన చూపులతో ఉంది.
శివుడు పంచముఖి అని తెలియజేసే విధంగా సదాశివుని రూపాన్ని సూచించే ఈ చతుర్ముఖ లింగంలోని నాలుగు ముఖాలు తత్పురుష, వామదేవ, సత్యజాత, భైరవ నాలుగు దిక్కులనూ సూచిస్తుండగా, ఆకారము లేని ఐదవది ఈశాన అనంత విశ్వాన్ని సూచిస్తోంది.
ఈ గుడి నిర్మాణం మొదట ఐదవ శతాబ్దంలో జరిగినా, ప్రస్తుతమున్న కట్టడాన్ని తొమ్మిదవ శతాబ్దంలో పునర్నిర్మించడం జరిగింది.