దేవుడి దర్శనం తర్వాత తలపై శఠగోపం పెట్టటానికి గల పరమార్థం ఏమిటో తెలుసా..?

మన హిందూ సంస్కృతిలో పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేయడమే కాకుండా దేవాలయాలకు వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి దర్శించుకున్న వెంటనే అక్కడ ఉన్న పూజారి మనకు దేవుడి ప్రసాదం ఇవ్వటమే కాకుండా తలమీద శఠగోపం పెడుతూ ఉంటారు. అయితే తలపై ఇలా శతగోపం ఎందుకు పెడతారు అన్న సంగతి చాలామందికి తెలియదు. దేవుడి దర్శనం తర్వాత తలపై శఠగోపం పెట్టటానికి గల కారణం ఏమిటి? అందులో ఉన్న పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గుడికి వెళ్ళిన తర్వాత భక్తులు వారు కోరిన కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తారు. అయితే దేవుడి దర్శనం తర్వాత శఠగోపం పెట్టేటప్పుడు మనం తల వంచుతాము. అయితే నిత్యం మంత్రోచ్ఛారణలతో శక్తివంతమయ్యే స్వామి సన్నిధిలో ఉండే శఠగోపం పూజారి పెట్టినప్పుడు మనిషి కి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని మనసులో తలచుకొని తలవంచి తీసుకుంటాము. అంతే కాకుండా
శఠగోపం లో ఆ పరమాత్ముడు కొలువై ఉంటాడని పండితులు చెబుతున్నారు. సహస్రార చక్రానికి తాకించిన శఠగోపంతలపై పెట్టడం వలన మనలోని కుండలినీ శక్తి ప్రేరేపించబడుతుంది.

అంతే కాకుండా శఠగోపం పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని బలంగా కోరుకుంటే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. అందువల్ల ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులందరూ తప్పనిసరిగా తలపై శఠగోపం పెట్టించుకుంటారు. ఇలా చేయటం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం మనపై ఉండి మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ శఠగోపం తలపై పెట్టటం వల్ల ఈ జన్మ లభించడానికి కారణమైన పుణ్య కార్యాలను, భగవంతుని దర్శనం లో గల మహత్తుని మనకి గుర్తు చేస్తుందని పండితులు చెబుతున్నారు.